Karnataka | బెంగళూరు: కర్ణాటకను మంకీ ఫీవర్ వణికిస్తున్నది. ఇద్దరు మరణించడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఈ వ్యాధి వల్ల మొదటి మరణం జనవరి 8న శివమొగ్గ జిల్లా, హోసనగర్ తాలూకాలో సంభవించింది. 18 ఏండ్ల బాలిక ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. ఈ వ్యాధి కారణంగా మరణించిన రెండో వ్యక్తి ఉడుపి జిల్లాకు చెందిన 79 ఏండ్ల వృద్ధుడు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 49 పాజిటివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఉత్తర కన్నడలో 34 మంది, శివమొగ్గలో 12 మంది, చిక్కమగళూరులో ముగ్గురు ఈ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు.