Rahul Gandhi | న్యూఢిల్లీ, జనవరి 15: బీజేపీ, ఆర్ఎస్ఎస్తోపాటు భారత రాజ్యంతోనూ తమ పార్టీ పోరాడుతున్నదని కాంగ్రెస్ నాయకుడు రాహుఎల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రాహుల్ గాంధీ చెప్పే మాటలు, చేసే చేష్టలన్నీ భారతదేశాన్ని ముక్కలు చేసి, సమాజాన్ని చీల్చే దిశలోనే ఉంటాయని బీజేపీ మండిపడింది. బుధవారం నాడిక్కడ కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధాన కార్యాలయ భవనం ప్రారంభోత్సవంలో రాహుల్ ప్రసంగిస్తూ అయోధ్య రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రాణపత్రిష్ట తర్వాతే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందంటూ ఆర్ఎస్ఎస్ అగ్రనేత మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయని, ఇది భారతీయులని అవమానించడమేనని అన్నారు.
తాము నిజాయితీగా పోరాడుతున్నామని భావించవద్దని, ఇందులో నిజాయితీ లేనేలేదని రాహుల్ అన్నారు. తామంతా రాజకీయ సంస్థలైన బీజేపీ, ఆర్ఎస్ఎస్తో పోరాడుతున్నామని, మన దేశంలోని ప్రతి వ్యవస్థను ఆ రెండూ కబ్జా చేశాయని ఆయన ఆరోపించారు. తామంతా ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్తోపాటు భారత రాజ్యంతోనూ పోరాడుతున్నామని ఆయన పేర్కొన్నారు.
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ వికృత రూపాన్ని ఆ పార్టీ నాయకుడే బయటపెట్టారన్నారు. రాహుల్ గాంధీకి ఆయన సన్నిహితులకూ అర్బన్ నక్సల్స్‌తో, దేశాన్ని అవమానించి, కించపరిచి, అప్రతిష్ట పాల్జేయాలని భావించే వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న విషయం రహస్యమేమీ కాదని నడ్డా ఆరోపించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ భారత రాజ్యంతోనూ పోరాడుతున్నామని చెబుతున్న రాహుల్.. చేతిలో రాజ్యాంగం ప్రతిని ఎందుకు ఉంచుకుంటున్నారని ప్రశ్నించారు.