అయోధ్య: ‘స్వయంగా నేను అవినీతికి పాల్పడను. ఇతరులు అవినీతి చేయడానికి అంగీకరించను’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభల్లో తరచూ చెప్తుంటారు. ‘పని చేయని, అవినీతికి పాల్పడిన అధికారులతో నిర్బంధ పదవీ విరమణ చేయించడానికి మంత్రులు వెంటనే వారి వివరాలను నాకు అందజేయాలి’ అంటూ 2019లో అమాత్యులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ‘గుజరాతీ వ్యాపారులు విదేశాల్లో దాచి ఉంచిన కోట్ల రూపాయలను భారత్‌కు రప్పిస్తా, ప్రతి భారతీయుడి ఖాతాలో రూ. 15 లక్షలు వేయిస్తా’ అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అవినీతి పేరెత్తితో చాలు తీవ్రంగా గర్జించే ప్రధాని నరేంద్ర మోదీ కోట్లాది రూపాయల దేవుడి సొమ్మును స్వయాన భక్తులుగా చెప్పుకునే వారే స్వాహా చేస్తుంటే మౌనంగా ఎందుకు ఉన్నారంటూ ‘వైర్’ న్యూస్ వెబ్సైట్ తన కథనంలో ప్రశ్నించింది.
అయోధ్య నిధుల దుర్వినియోగం రూ.లక్షల నుంచి రూ.1400 కోట్ల వరకు ఎంతైనా ఉండవచ్చునని పేర్కొంది. అయోధ్యరాముడి నిధులను పాపభీతి లేకుండా కొందరు కైంకర్యం చేసినా మోదీ మౌనాన్ని వీడరా? అని పేర్కొంది. నిధుల దుర్వినియోగంపై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా 12 రోజుల పాటు సిట్‌తో దర్యాప్తు చేయడాన్ని సీనియర్ పాత్రికేయులు పీ రామన్ ప్రస్తావించారు.ఈ దారుణం వెనుక ఉన్న స్వపక్షీయులను రక్షించడానికి చేసే ప్రయత్నంగా దీన్ని పేర్కొన్నారు. ఆరంభం నుంచే అయోధ్య ఆలయ ప్రాజెక్ట్ అనేక రకాల మోసాలు, అక్రమాలకు నిలయంగా మారింది. అనుమానాస్పద భూ లావాదేవీలు సహా అయోధ్యకు సంబంధించిన ఆరు వివాదాల స్వభావాన్ని గతంలోనే తాము వివరించినట్టు ది వైర్ తన కథనంలో పేర్కొంది.
అయోధ్యలో విరాళాల దుర్వినియోగం, లెక్కింపులో అక్రమాలపై ఇప్పటికే తాత్కాలిక నివేదికను అందజేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన దర్యాప్తులో హుండీల నిర్వహణలో పలు భారీ లోపాలు, అక్రమాలను కనుగొంది. ముఖ్యంగా పలు విభాగాల్లో ప్రామాణిక కార్యాచరణ విధానాలు (ఎస్‌వోపీలు) పాటించని విషయాన్ని ఎత్తిచూపింది. నగదు లెక్కింపు సమయంలో సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేయడం, లెక్కింపు గది నుంచి సిబ్బంది లోపలికి, బయటకు వెళ్లేటప్పుడు తనిఖీ చేయడం, విరాళాలు, లెక్కింపునకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను 180 రోజుల పాటు భద్రపర్చడం వంటి విధానాలను ఉల్లంఘించారని తెలిపింది. శ్రీరామ జన్మభూమి తీర్థ్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాజీ డ్రైవర్ రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్నూ యాదవ్ వద్ద పలు హుండీలకు సంబంధించిన తాళాలు కలిగి ఉండటాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.
అయోధ్య రామ మందిర విరాళాల్లో అక్రమాల ఆరోపణల క్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాలు తమ పదవులకు చేసిన రాజీనామాలు తమకు అందినట్టు ట్రస్ట్ శనివారం నిర్ధారించింది. విరాళాలపై వచ్చిన ఆరోపణలపై నిష్పాక్షికమైన విచారణ జరిగి భక్తుల్లో విశ్వాసం తిరిగి పొందాలని తాము కోరుకుంటున్నామని ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో ఇప్పటికే అరెస్టయిన టిన్నూ యాదవ్‌పై రోకడియా హనుమాన్ మందిరం అధిపతి ఆచార్య వినోద్ మిశ్రా తీవ్ర ఆరోపణలు చేశారు. తన శిష్యుడు, జాన్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త అజయ్ విశ్వకర్మ ఎంతో విలువైన ఒక బంగారు నెక్లెస్, చరణ పాదుకలను ఆలయ నిర్మాణం అనంతరం స్వామివారికి విరాళంగా ఇచ్చారని తెలిపారు. వాటిని స్వీకరించిన టిన్నూ, దాని రసీదు, నెక్లెస్‌ను అలంకరించిన తర్వాత ఫొటోలను పంపుతామని హామీ ఇచ్చాడని, అయితే 8 నెలలైనా రసీదు కానీ, ఫొటోలు కానీ ఇవ్వలేదని ఆరోపించారు.