న్యూఢిల్లీ, ఆగస్టు 27: పలు రాష్ర్టాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోసేందుకు బీజేపీ ఏకంగా రూ.6,300 కోట్లు ఖర్చు చేసిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దుయ్యబట్టారు. ఇంత భారీ మొత్తాన్ని బీజేపీ ఖర్చు చేసి ఉండకపోతే తినే తిండిపై జీఎస్టీ విధించాల్సిన అవసరం రాకపోవునని శనివారం ట్విట్టర్ వేదికగా ఆయన మండిపడ్డారు. జీఎస్టీ పెంపు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ద్వారా వచ్చిన సొమ్మును ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ వాడుకుంటున్నదని ఆరోపించారు.
వేరే పార్టీల ఎమ్మెల్యేలను కొని, ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ ఖర్చు చేయడం వల్లే సామాన్య ప్రజలు అధిక ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పెరుగు, మజ్జిగ, తేనె, గోధుమలు, బియ్యం వంటి తినే పదార్థాలపై జీఎస్టీ విధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏటా రూ.7,500 కోట్లు ఆదాయం వస్తున్నదని చెప్పారు. అందులో రూ.6,300 కోట్లను ప్రభుత్వాలను పడగొట్టేందుకే బీజేపీ ఖర్చు చేసిందని మండిపడ్డారు.