న్యూఢిల్లీ, మే 16: ‘సంవత్సరం వరకు బంగారం కొనొద్దు, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి, వంట నూనెల వాడకాన్ని తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, మెట్రోలు, కార్పూల్ను వినియోగించండి..’ అంటూ హైదరాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన విజ్ఞప్తికి ప్రధాన మీడియా, టెలివిజన్ యాంకర్లు తల ఊపారే తప్ప.. మోదీజీ ఏం జరిగింది? మీరు ఇలా ఎందుకు ప్రకటించారు? మన ఆర్థిక వ్యవస్థ భద్రమే కదా? అని ఒక్కరు కూడా అడిగిన పాపాన పోలేదు. అయితే వారు చేయలేని పనిని ఇద్దరు స్టాండప్ కమెడియన్లు చేసి పాత్రికేయ వర్గం సిగ్గుపడేలా చేశారు.
ప్రముఖ స్టాండప్ కమెడియన్ వరుణ్ గ్రోవర్ ఇటీవల ఒక ప్రదర్శనలో ‘మోదీజీ.. భారత ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉందా?’ అని ప్రశ్నించారు. ‘ఈ దేశంలో బంగారం కొనే స్థితిలో ఉండేలా ఎవరినైనా మీరు విడిచిపెట్టారా? నోట్ల రద్దు, కొవిడ్లు ఆర్థిక వ్యవస్థను కుంగదీశాయి. చిన్న వ్యాపారులను జీఎస్టీ నలిపేసింది. ఇప్పుడేమో బంగారు నగలపై ఎక్కువగా ఖర్చు చేయవద్దంటూ అధికారిక విజ్ఞప్తి.. ఇదంతా చూస్తుంటే ప్రధానికి ప్రజల మనోభావాలు ఏమీ అర్థం కావడం లేదనిపిస్తుంది. ప్రజల వద్ద ఖర్చు చేయడానికి అసలు ఏమీ మిగిలి లేదు’ అని ఆయన అన్నారు.
మరో స్టాండప్ కమెడియన్ తన ప్రదర్శనకు ఒక మహిళా ఐఆర్ఎస్ అధికారి రావడాన్ని గమనించి ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు. ప్రధాని ఎందుకు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు? అని ఆమెను ప్రశ్నించారు. ‘మోదీయే కనుక టైటానిక్ ఓడలో ఉంటే.. ఆ ఓడ మంచు కొండను ఢీకొంటుందని చెప్పరు. దానికి బదులుగా మిత్రులారా రెయిలింగ్ నుంచి దూకవద్దు, బేస్మెంట్ పైకి వెళ్లకండి, మెట్ల పక్కన నిల్చోకండి అని మాత్రమే చెబుతారు’ అని ఆయన వ్యంగ్యంగా అన్నారు.సమాజానికి అద్దం పడుతుంది అయితే పాత్రికేయులు చేయలేని పనిని హాస్యనటులు చేయడం ప్రస్తుత సమాజ పరిస్థితికి అద్దం పడుతున్నది. ఇక్కడ గ్రోవర్, గుప్తా అడిగిన ప్రశ్నలు మరీ అంత తీవ్రమైనవి కావు.