ప్రధాని నరేంద్ర మోదీతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ భేటీ అయ్యారు. రష్యా- భారత్ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో జరిగింది. ఈ సందర్భంగా వీరిద్దరి భేటీ జరిగింది. 2019 లో బ్రిక్స్ సమావేశం తరువాత వీరిద్దరూ ప్రత్యక్షంగా కలుసుకోవడం ఇదే ప్రథమం. కోవిడ్‌తో సహా ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఇరు దేశాల మధ్య స్నేహబంధం మాత్రం చెక్కుచెదరలేదని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్‌తో పాటు సంక్షోభ సమయంలో ఇరు దేశాల పౌరులను తమ తమ దేశాలకు చేరవేసే విషయంలో ఇరు దేశాలూ సంపూర్ణ సహకారంతో ముందుకు సాగాయని మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.
కొన్ని దశాబ్దాలుగా అంతర్జాతీయ యవనికపై అనేక రకాలైన మౌలిక సవాళ్లు ఎదురయ్యాయని, భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా మారిపోయి, కొత్త కొత్త రాజకీయ సవాళ్లు ఉదయించాయని, అయినా భారత్- రష్యా సంబంధాల్లో మాత్రం ఈషన్మాత్రమైనా తేడాలు తలెత్తలేదని మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహత్వం ఓ ప్రత్యేకమైందని పేర్కొన్నారు.
ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా భారత్ దౌత్య వ్యవహారాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ ఓ సూపర్ పవర్ దేశమని తాము బలంగా విశ్వసిస్తామని పుతిన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ యనవికపై ఎన్ని అవాంతరాలు ఎదురైనా, వాటన్నింటికీ ఎదురొడ్డి ఇరు దేశాల స్నేహం కొనసాగిందని పుతిన్ కితాబునిచ్చారు. యేటికేడాది ఇరు దేశాల మధ్య సంబంధాలు పురోభివృద్ధిలోనే సాగుతున్నాయని, భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతాయన్న విశ్వాసాన్ని రష్యా అధ్యక్షుడు ప్రకటించారు.