భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌లపై పరిశ్రమ వర్గా లు, ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రధాని నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ట్రంప్‌ను పల్లెత్తు మాట అనకుండా..ప్రతీకార సుంకాల ప్రకటన చేయకుండా ‘స్వదేశీ’ వస్తువులనే కొనాలని భారతీయులకు పిలుపునిచ్చారు. దీంతో మోదీ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 2 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై టారిఫ్‌ల వాత విధించినా, డెడ్ ఎకానమీ అని అవహేళన చేసినా, పాక్ చమురును కొనే రోజులు వస్తాయని ఇండియాను తక్కువ చేసినా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ఖండన రాలేదు. తమ దేశాలపై నోరుజారిన ట్రంప్‌ను బ్రెజిల్, చైనా తదితర దేశాలు తూర్పారబట్టాయి. యుద్ధానికి కూడా తాము సిద్ధమేనంటూ రష్యా ఏకంగా కయ్యానికి కాలు దువ్వుతున్నది. అయినప్పటికీ, మోదీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంపై పెద్దయెత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో శనివారం యూపీలోని తన సొంత నియోజకవర్గం వారణాసిలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న మోదీ.. ఎట్టకేలకు నోరు విప్పారు. దీంతో ట్రంప్ అనుచిత వ్యాఖ్యలపై మోదీ ఘాటుగా స్పందిస్తారేమోనని, సుంకాలకు ప్రతీకార చర్యల ప్రకటన ఉంటుందేమోనని అంతా భావించారు. అయితే, అలాంటిదేమీ లేకుండా ‘స్వదేశీ’ మంత్రంతో, మూడో ఆర్థిక వ్యవస్థ పేరుతో ఎప్పటిలాగే మోదీ తన పాతపాట పాడారు. దీంతో మోదీ వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వారణాసిలో మోదీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నది. అన్ని దేశాలూ తమ సొంత ప్రయోజనాలపైనే దృష్టి సారిస్తున్నాయి. భారత్ కూడా అతి త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారనున్నది. మన ఆర్థిక ప్రయోజనాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. భారతీయులు తయారు చేసిన వస్తువులనే కొనుగోలు చేద్దాం’ అని మోదీ పిలుపునిచ్చారు.