Mallikarjun Kharge : ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఏదో ఒకరోజు దేశాన్ని అమ్మేస్తాడని కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయ అధ్యక్షుడు (National president) మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు. భారత ఆర్థిక ఆర్థికవ్యవస్థ (Indian Economy) లో ఇప్పుడు గుత్తాధిపత్యం రాజ్యమేలుతోందని, ప్రభుత్వ ఆస్తులన్నింటిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థలో గుత్తాధిపత్యం రాజ్యమేలుతోంది. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఈ ప్రభుత్వానికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదు. కానీ ప్రభుత్వ ఆస్తులను మాత్రం ఒక్కొక్కటిగా మిత్రులకు కట్టబెడుతున్నారు. ఇలాగే కొనసాగితే ఏదో ఒకరోజు ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వం ఈ దేశాన్ని అమ్మేస్తారు. నెహ్రూ నిర్మించిన ప్రభుత్వరంగ ఫ్యాక్టరీలు అన్నింటిని మోదీ అమ్ముతున్నారు’ అని ఖర్గే విమర్శించారు.
‘దేశం కోసం నువ్వేం చేశావు, మేమేం చేశాం..? భవిష్యత్ తరాలకు నువ్వు ఏం ఇవ్వదల్చుకున్నావు..?’ అని అడిగితే మోదీ నోరు మెదపరని, కానీ కాంగ్రెస్ పార్టీని నిందించడానికి మాత్రం ముందుంటారని ఖర్గే మండిపడ్డారు. దేశంలో అన్నింటా ప్రభుత్వ ఆధిపత్యమే కొనసాగుతున్నదని, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నదని, అందుకే ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.