BJP | హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యవహారశైలిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ఎదుగుదల కోసం కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈడీ, సీబీఐ, ఐటీ తదితర సంస్థలను పావులుగా వాడుకొంటున్నదని ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతోపాటు పలువురు ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేస్తూ..అక్రమ కేసుల్లో ఇరికిస్తున్న విధానాన్ని ఎండగడుతున్నారు. శనివారం ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు పిలిచిన నేపథ్యంలో పలు జాతీయ మీడియా చానళ్లు ప్రత్యేకంగా డిబేట్లను ఏర్పాటు చేశాయి. ఇందులో ప్రజాస్వామికవాదులు, పలు పార్టీల నేతలు పాల్గొని.. బీజేపీ రాజకీయ కక్షసాధింపు చర్యలపై నిప్పులు చెరిగారు. ప్రజల్లో ఆదరణ కోల్పోతుండటంతో బీజేపీ నాయకత్వానికి మతిభ్రమించిపోతున్నదని విమర్శించారు. ఆ పార్టీ జనాదరణ కలిగిన నేతలపై అవినీతి బురదజల్లి లబ్ధి పొందాలని చూస్తున్నదని, అందులోభాగంగానే సీబీఐ, ఈడీ పేరిట వేధింపులకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. బీజేపీ విధానాలపై సామాజిక మాధ్యమాల్లోనూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఈడీ, సీబీఐలు బీజేపీ పెంపుడు కుక్కలు అంటూ కొందరు, బీజేపీ అనుబంధ సంస్థలుగా మారాయని మరికొందరు నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సెటైరికల్ మీమ్స్‌తో బీజేపీని చెడుగుడు ఆడుకొన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్రంలోని బీజేపీ సర్కారు, ప్రధాని మోదీ పగబట్టారని ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న తీరును ఓర్వలేకనే ఇలాంటి కుట్రలకు తెగబడుతున్నదని నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీని తూర్పారబట్టారు. ముస్లింలను ఆర్థికంగా బహిష్కరించాలని, ఇండ్లలో ఆయుధాలు దాచుకోవాలని బీజేపీ ఎంపీలు ప్రజలను రెచ్చగొడుతున్నారని, అవేవీ కనిపించడం లేదా? అని మోదీని నిలదీశారు. ట్విట్టర్ వేదికగా మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. దేశవ్యాప్తంగా ఈడీ, సీబీఐ, ఐటీ తదితర ఏజెన్సీలు అక్రమంగా బనాయిస్తున్న కేసులను తీవ్రంగా ఖండించారు.
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పర్యటనలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) జాతీయ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్.. బీజేపీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తీరుపై విరుచుకుపడ్డారు. విపక్ష నేతలపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులపై మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారు గత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలనే అనుసరిస్తున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్మాదిరిగానే బీజేపీ పతనం తప్పదని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రతిపక్ష నేతలను వేధించడమే లక్ష్యంగా పని చేస్తున్నదని, కేంద్రం కనుసన్నల్లోనే సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖ తదితర అన్నీ ఏజెన్సీలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. యూపీలో, దేశంలో గాంధీ చూపిన అహింసాయుత పాలనపోయి బుల్డోజర్ పాలన నడుస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
దేశవ్యాప్తంగా ఈడీ, సీబీఐవంటి ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల వ్యవహార తీరుపై బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు నితీశ్‌కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకొంటున్నదని నిప్పులు చెరిగారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌తో సహా ప్రతిపక్ష నేతలపై కేంద్ర ఏజెన్సీల దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు నియంతృత్వానికి ఇది పరాకాష్ట అని శివసేన (ఉద్ధవ్ బాల్ఠాకరే) నాయకుడు సంజయ్‌రౌత్ పేర్కొన్నారు. తన సహచరుడు సదానంద్ కదమ్‌ను ఈడీ ప్రశ్నించడాన్ని రాజకీయ ఎత్తుగడగా ఆయన అభివర్ణించారు. ఖేడ్‌లో ఉద్ధవ్ బహిరంగ ర్యాలీని విజయవంతం చేసేందుకు కదమ్ చాలా కష్టపడ్డారని, అందుకే ఈడీ పేరిట అతన్ని బీజేపీ అరెస్టు చేసిందని పేర్కొన్నారు. పవర్ వస్తుంది..పోతుంది.. ప్రతి ఒకరికీ ఓ టైం వస్తుందని బీజేపీని హెచ్చరించారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీని ప్రశ్నిస్తే చాలు ఈడీ, సీబీఐ విచారణలు సర్వసాధారణంగా మారిపోయాయని నిప్పులు చెరిగారు. ‘మోదీ జిందాబాద్’ అంటే కవితను వెంటనే వదిలేస్తారని విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతో ప్రత్యర్థులను చెప్పు చేతల్లో పెట్టుకోవాలనేది బీజేపీ ఉద్దేశమని పేర్కొన్నారు. వ్యతిరేకంగా ఉండేవారిని వెంటాడటం, వేటాడటం బీజేపీ అనాగరిక చర్యలకు ఉదాహరణలు అని పేర్కొన్నారు. ఈడీలు, సీబీఐలు ఎన్ని వచ్చినా బెదరకుండా పోరాడాలని, నిరుత్సాహపడకుండా ధైర్యంగా పోరాడుతూ ముందుకుపోవాలని కవితకు సూచించారు. భయపడితే మరింతగా భయపెట్టడం.. బెదిరించడం బీజేపీ నైజమని తెలిపారు. అలాంటి అహంకారపూరిత బీజేపీపై ప్రతి ఒకరూ పోరాడాలని నారాయణ పిలుపునిచ్చారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారుకు రాబోయే రోజుల్లో ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్ హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ పేరిట బీజేపీ దాడులు చేయిస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీలను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి ఆరాచకాలకు తెగబడుతున్నదని నిప్పులు చెరిగారు. ఈడీ అంటే ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్ అని ఎద్దేవా చేశారు.