న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. యుద్ధం వేళ 15,000 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయెల్‌కు మోదీ ప్రభుత్వం పంపుతోందని విమర్శించారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) ద్వారా హర్యానా యువతను ఇజ్రాయెల్‌కు పంపుతున్నారని ఆరోపించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు మల్లికార్జున్ ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుండగా మోదీ ప్రభుత్వంలోని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సుమారు 15,000 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయెల్‌లో నియమించింది’ అని విమర్శించారు.
కాగా, తప్పుడు సాకులతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చేరేలా భారతీయ యువకులను మోసగించేందుకు మోదీ ప్రభుత్వం అనుమతించిందని మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. దీంతో చాలా మంది మరణించారని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న యువజన వ్యతిరేక విధానాల వల్ల నిరుద్యోగ సమస్య ఏర్పడిందన్న విషయాన్ని ఇది తెలియజేస్తోందని విమర్శించారు. సంఘర్షణ ప్రాంతాలలో ఉద్యోగాల కోసం హర్యానాలోని యువతను బలవంతంగా పంపుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో బీజేపీకి వారు తగిన గుణపాఠం చెబుతారని ఖర్గే హెచ్చరించారు.