Lok Sabha : పార్లమెంట్లో లోక్‌సభ సీట్ల పెంపుపై కేంద్రం తాజా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీని ప్రకారం లోక్‌సభ సీట్లు 543 నుంచి 850కి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తగిన డ్రాఫ్ట్ కాపీని రూపొందించిన కేంద్రం పార్లమెంట్‌లోని పార్టీలకు, ఎంపీలకు అందజేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లు సవరణ, నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరుగుతాయి.
కేంద్ర ప్రతిపాదనల ప్రకారం.. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 ఎంపీ సీట్లు 850కి పెరుగుతాయి. ఇందులో రాష్ట్రాల్లో 815 స్థానాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 35 వరకు స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ప్రస్తుతం నారి శక్తి వందన్ అభినియం పేరుతో ఈ బిల్లును ప్రవేశపెట్టబోతుంది కేంద్రం. 2011 జనాభా లెక్కలకు అనుగుణంగా ప్రస్తుతానికి మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారు. దీని ప్రకారం మహిళలకు పార్లమెంట్లో 273 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లును, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును త్వరలోనే పార్లమెంట్లో ఆమోదింపజేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ రెండింటిని 2029 లోక్‌సభ ఎన్నికల్లో అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది.
నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్రం ఒక కమిటీని నిర్ణయిస్తుంది. ఈ కమిటీయే మహిళలకు సీట్లు కేటాయిస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలైతే పార్లమెంట్‌తోపాటు రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ మహిళలకు సీట్లు పెరుగుతాయి. ఈ బిల్లులు అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 55, ఆర్టికల్ 81లను సవరించాలి. ఇది 131వ రాజ్యాంగ సవరణ అవుతుంది.