Modi | ఢిల్లీ, మే 11: పాక్‌పై భారత్ చివరి వరకు పైచెయ్యిలో నిలిచినా.. అనూహ్యంగా మోదీ సర్కారు కాల్పుల విరమణకు అంగీకరించడంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు దిద్దుబాటు చర్యలకు దిగింది. ఆదివారం ప్రధాని మోదీ త్రివిధ దళాధిపతులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా.. పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించి, మళ్లీ కవ్వింపులకు దిగితే తీవ్రంగా స్పందించాలని ఆర్మీ అధికారులకు మోదీ సూచించినట్టు అనుకూల మీడియాకు లీకులు ఇచ్చారు. వాళ్లు తూటా పేల్చితే ఫిరంగులతో సమాధానం ఇవ్వాలని సూచిం చినట్టు చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌లోని ఏ ప్రాంతం కూడా సురక్షితం కాదని టెర్రరిస్టులకు స్పష్టమైన సంకేతం ఇచ్చామని మోదీ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇదంతా దిద్దుబాటు చర్యల్లో భాగమేనని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు అంగీకరించడంపై వెల్లు వెత్తుతున్న విమర్శలను అడ్డుకునేందుకు సైతం తంటాలు పడినటట్టు స్పష్టం అవుతున్నది.
‘కశ్మీర్ విషయంలో భారత్‌కు స్పష్టమైన వైఖరి ఉంది. పీవోకేను భారత్‌కు తిరిగి ఇవ్వడం తప్ప మరో అంశం గురించి చర్చ అవసరం లేదు. ఉగ్రవాదులను అప్పగించడంపై వారు మాట్లాడితే, చర్చించేందుకు మేం సిద్ధం. ఇది తప్ప మరో అంశం గురించి మాట్లాడే ఉద్దేశం లేదు. ఎవరి మధ్యవర్తిత్వాన్నీ మేం కోరుకోవడం లేదు’ అని మోదీ చెప్పినట్టు బీజేపీ అనుకూల మీడియా, సోషల్‌మీడియాలో ప్రచారం చేశారు. దీంతో మోదీ సర్కారుపై విమర్శలు మరోసారి వెల్లువెత్తుతున్నాయి. అమెరికా ఒత్తిడికి తలొగ్గి, కాల్పుల విరమణకు అంగీకరించి ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగిందని పలువురు పేర్కొంటున్నారు. ఇరుదేశాల అంశంలోకి మూడో పక్షాన్ని తీసుకొచ్చినట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షరతులు లేకుండా సీజ్‌ఫైర్‌కు అంగీకరించి, ఇప్పుడు పీవోకేపైనే చర్చిస్తామని చెప్పడంలో ఆంతర్యమేంటని నిలదీస్తున్నారు. ఉగ్రవాదం పై పోరు మొదలుపెట్టి, ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించుకోకుండానే, వెనుకడుగు ఎందుకు వేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కాల్పుల విరమణకు అంగీకరించాక పీవోకేపై చర్చలంటే పాక్ లొంగుతుందా? అని నిలదీస్తున్నారు.