న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 : పార్లమెంట్లో వేయాల్సిన ప్రశ్నలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిమితులు విధించింది. ప్రధాని మోదీ సారథ్యంలో నడిచే సహాయ నిధుల వివరాలను ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించింది. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్షాలు.. ఇది పారదర్శకతకు పాతరేయడమేనని ధ్వజమెత్తాయి. కేంద్రం చర్యలు నియంతృత్వ పోకడలుగా అభివర్ణించాయి. లోక్‌సభలో సభావ్యవహారాల నిర్వహణకు సంబంధించిన నిబంధనల ప్రకారం పీఎం కేర్స్ నిధి, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి(పీఎంఎన్ఆర్ఎఫ్), జాతీయ రక్షణ నిధి(ఎన్డీఎఫ్)కి సంబంధించిన అంశాలపై పార్లమెంట్లో ప్రశ్నలు వేయడానికి సభ్యులకు అనుమతి లేదని లోక్‌సభ సచివాలయానికి ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) ఆదేశాలు జారీచేసినట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ దినపత్రిక ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది.
లోక్‌సభలో సభా కార్యకలాపాల ప్రవర్తన, నిబంధనల ప్రకారం ఈ మూడు నిధులకు సంబంధించిన ప్రశ్నలు వేయడానికి, వీటిపై చర్చించడానికి అనుమతి లేదని జనవరి 30న లోక్‌సభ సచివాలయానికి పీఎంవో ఉత్తర్వులు జారీచేసినట్లు పత్రిక పేర్కొన్నది. లోక్‌సభలో ప్రశ్నలు అడిగే హక్కును నిర్దేశించే షరతుల ప్రకారం భారత ప్రభుత్వానికి ప్రధానంగా బాధ్యత వహించని సంస్థలు లేదా వ్యక్తుల నియంత్రణలో ఉన్న విషయాలను ప్రస్తావించకూడదు అని పీఎంవో పేర్కొన్నది. లోక్‌సభలో వీటిపై ప్రశ్నలు వేసే అధికారం లేకపోవడానికి గల కారణం ఈ నిధుల కార్పస్ పూర్తిగా స్వచ్ఛంద ప్రజా సహకారంతో ఏర్పడిందని భారత సంఘటిత నిధి నుంచి కేటాయింపు పొందినది కాదని పీఎంవో స్పష్టం చేసింది. మూడు నిధుల గురించి సమాచారం కోరుతూ జీరో అవర్ లేదా ప్రత్యేక ప్రస్తావన నోటీసు లేదా ప్రశ్నను ఆమోదించాల్సిన యోగ్యతను నిర్ణయించాల్సిన పరిస్థితి తలెత్తితే నిబంధనల్లోని షరతులను అమలుచేయవచ్చని పీఎంవో లోక్‌సభ సచివాలయానికి సూచించింది.
పీఎం కేర్స్ నిధి, పీఎం జాతీయ సహాయ నిధి, జాతీయ రక్షణ నిధికి సంబంధించిన ప్రశ్నలను పార్లమెంట్లో అడగలేమని కాంగ్రెస్ సోమవారం వ్యాఖ్యానించింది. ఈ ఆదేశాలను పీఎంవో నేరుగా లోక్‌సభ సచివాలయానికి ఇచ్చిందని కాంగ్రెస్ తెలిపింది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన వార్తా కథనాన్ని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో షేర్ చేసిన కాంగ్రెస్ ఈ నిధులపై ఏ సభ్యుడు పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని లోక్‌సభ సచివాలయానికి పీఎంవో చెప్పిందని పేర్కొన్నది. ఈ చర్యను ప్రత్యక్ష నియంతృత్వంగా అభివర్ణించిన కాంగ్రెస్ ఇది పార్లమెంట్‌ను అవమానించడమేనని, ఎంపీల హక్కులపై దాడి అంటూ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాలుగు ప్రశ్నలు సంధించింది. ప్రజా ప్రతినిధులైన ఎంపీలను ప్రజా ప్రయోజనానికి చెందిన ప్రశ్నలు వేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? లక్షలు, కోట్ల ప్రజా ధనాన్ని మోదీ ప్రభుత్వం ఎందుకు స్పష్టంగా లెక్కించడం లేదు? దేశ ప్రజల నుంచి మోదీ ప్రభుత్వం కచ్చితంగా ఏమి దాచడానికి ప్రయత్నిస్తున్నది? నరేంద్ర మోదీ ఇష్టానుసారం దేశ పార్లమెంట్ ఇక నడుస్తుందా? అని ప్రశ్నించింది.
దేశంలో కొవిడ్ మహమ్మారి ప్రబలిన సందర్భంగా 2020 మార్చి 27న ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెనీ సిచుయేషన్స్ ఫండ్(పీఎం కేర్స్ ఫండ్) ఏర్పాటైంది. కొవిడ్ మహమ్మారి వంటి ఏదైనా అత్యవసర లేదా విపత్తు పరిస్థితిని ఎదుర్కోవడం, బాధితులకు ఉపశమనం అందించడం అనే ప్రాథమిక లక్ష్యంతో ఓ ప్రత్యేక నిధి ఉండవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పీఎం కేర్స్ ఫండ్ పేరుతో ఓ ప్రజా ధార్మిక ట్రస్ట్ ఏర్పాటైనట్లు పీఎం కేర్స్ ఫండ్ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు.