న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 : ‘కేటాయింపులు ఘనం.. ఖర్చు చేసింది అంతంత మాత్రం..’ తరహాలో ఉంది కేంద్ర ప్రభుత్వ వైఖరి. పథకాలకు భారీగా కేటాయింపులు చేస్తున్నట్టు బడ్జెట్ సమర్పించే సమయంలో గొప్పగా ప్రకటిస్తున్న మోదీ సర్కారు.. వాటిని ఖర్చు చేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ముఖ్యమైన పథకాలకు పెద్ద మొత్తంలో కేటాయింపులు జరుపుతున్నా వాస్తవానికి అందులో ఇంచుమించు నాలుగో వంతు నిధులు ఖర్చు చేయడం లేదు. 2025-26 ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల (9 నెలలు) కాలంలో కేవలం 40 శాతం కన్నా కొంచెం ఎక్కువ మాత్రమే నిధులను ఖర్చు చేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఇది 75 శాతానికి చేరుతుందని అంచనా.
ప్రతి ఏడాది 25 శాతం నిధులు ఖర్చు చేయకుండానే మురిగిపోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి 53 ప్రధాన పథకాలకు రూ.500 కోట్లు, అంతకన్నా ఎక్కువ కేటాయించారు. అటు కేంద్రం, ఇటు రాష్ర్టాలు కూడా భాగస్వామ్య పద్ధతిలో నిర్దేశించిన శాతంలో నిధులు కేటాయిస్తూ ఈ పథకాలను అమలు చేస్తున్నాయి. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కింద చేపట్టే మౌలిక సదుపాయాల నిర్వహణా పథకాలు, ఇందిరా గాంధీ జాతీయ వితంతు పెన్షన్ పథకం, ఎస్ఎస్సీ, ఇతరులకు ఇచ్చే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్.. ఈ మూడు పథకాలకు మాత్రమే సవరించిన అంచనా(ఆర్ఈ), బడ్జెట్ అంచనా మొత్తానికి సమానంగా ఉంది. వీబీ జీ రామ్ జీ పథకం, ఎస్టీలకు పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్, సేంద్రియ వ్యవసాయంపై జాతీయ మిషన్ పథకాలకు మాత్రం సవరించిన అంచనా, బడ్జెట్ అంచనాలో 100 శాతం కంటే ఎక్కువ ఉన్నది. ఇక మిగిలిన 47 పథకాలకు బడ్జెట్ అంచనా కన్నా సవరించిన అంచనా మొత్తం తక్కువగా ఉంది. ఇక పీఎం కృషి సించాయి యోజన పథకానికి రూ.850 కోట్ల బడ్జెట్ కేటాయించగా, అతి తక్కువగా అందులో ఆరోవంతు రూ.150 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
ఇక కొన్ని పథకాలైతే మరీ ఘోరంగా ఉన్నాయి. కేటాయించిన నిధుల్లో 10 శాతం కూడా వీటికి ఖర్చు చేయలేదు. జలజీవన్ మిషన్/నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ మిషన్‌కు రూ.67,000 కోట్లను కేటాయించగా, ఈ తొమ్మిది నెలల కాలంలో కేవలం రూ.31 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. అలాగే పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకానికి రూ.7,500 కోట్లు కేటాయించగా, 473 కోట్లు, ప్రధాన మంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ్ యోజన్ పథకానికి రూ.2,1140 కోట్లకు రూ.40 కోట్లను మాత్రమే వ్యయం చేశారు. ఇక వాస్తవ కేటాయింపులో 40 శాతం కన్నా తక్కువగా సవరించిన అంచనాలున్న పథకాల్లో పీఎంఎస్‌వై-కమాండ్ ఏరియా డెవలప్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ పథకం, పీఎం ఈ బస్ సేవ, ధార్తి ఆబ జన్‌జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్, జన్ జీవన్ మిషన్/నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ వంటి పథకాలు ఉన్నాయి.