చండీగఢ్ : బీజేపీ పాలిత హర్యానా రాష్ట్రం ఢిల్లీకి సరఫరా చేసే యమునా నీటిలో విషం కలిపిందని ఆరోపణలు చేసిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు హర్యానాలోని సోనిపట్ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 17న తమ ముందు హాజరు కావాలని సోనిపట్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నేహా గోయల్ నోటీసులు పంపారు. కాగా, హర్యానా నుంచి తమకు వచ్చిన యమునా నదీ జలాలు అత్యంత కలుషితమైనవి, విషపూరితమైనవని, మానవ ఆరోగ్యానికి చేటు తెచ్చేవని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. తాను చేసిన ఆరోపణలకు ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీస్‌కు సమాధానంగా బుధవారం 14 పేజీల వివరణను సమర్పించారు.
యమునా నదిలో హర్యానా రాష్ట్రం విషం కలుపుతున్నదని కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. అసహ్యకరమైన ఆయన ఆరోపణలు నిరాశకు సంకేతమని, ఈ ఎన్నికల్లో తాము యమునా నదిలో మునుగుతామని ఆప్ పార్టీ గ్రహించిందని అన్నారు. ఆప్ నేతలను పేరుమోసిన మోసగాడు, సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌తో పోల్చారు.