ఇప్పటివరకు విమానాశ్రయాల్లో బ్యాగులను తెరిచి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, చార్జర్లు స్కానింగ్ చేసేవారు. ఇకపై బ్యాగులను తెరవాల్సిన అవసరం లేకుండా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం అత్యంత ఆధునిక పరికరాలను విమానాశ్రయాల్లో అందుబాటులోకి తీసుకురానున్నది. తొలుత కేవలం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏర్పాటు చేయనున్నారు. అనంతరం విడతల వారీగా అన్ని ఎయిర్‌పోర్టుల్లో ఏర్పాటు చేస్తామని బీసీఏఎస్ వెల్లడించింది.
ఇప్పటివరకు బ్యాగుల్లోని ఎలక్ట్రానిక్ పరికరాలను బయటకు తీసి ప్రత్యేక ట్రేలో పెట్టి స్క్రీనింగ్ చేసేవారు. దీని వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవడంతోపాటు సమయం ఎక్కువగా తీసుకుంటున్నది. దీన్ని అధిగమించేందుకు బీసీఏఎస్ అత్యంత ఆధునిక పరికరాలను ఎయిర్‌పోర్టుల్లో బిగించేందుకు చర్యలు తీసుకుంటున్నది. నెల రోజుల్లోగా నాలుగు ఎయిర్‌పోర్టుల్లో వీటిని బిగించనున్నారు. ఇలాంటి పద్ధతులను ఇప్పటికే అమెరికాతోపాటు యూరప్ దేశాల్లో అమలుచేస్తున్నారు.
‘ప్రయాణికులను వేగంగా, మెరుగైన భద్రతా పరికరాలతో క్లియర్ చేయడమే తమ లక్ష్యం’ అని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో బ్యాగుల్లోని ఎలక్ట్రానిక్ పరికరాలను తనిఖీ చేయడం తలకు మించిన పనిగా మారడంతో ఈ ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేసేందుకు బీసీఏఎస్ ముందుకొచ్చింది. ఈ పరికరాల వల్ల అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని టెర్మినల్స్ వద్ద చెక్ ఇన్, సెక్యూరిటీ కోసం ప్రయాణికులు గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన అవసరం ఉండదని అధికారులు చెప్తున్నారు.