Sonam Wangchuk : నీట్ సహా వివిధ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన దీక్ష బుధవారం 11వ రోజుకు చేరింది. అయితే, ఇప్పుడు ఈ దీక్ష విషయంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. నిజానికి జంతర్‌మంతర్ వద్ద నిరసన మొదలుపెట్టింది అభిజీత్ దీప్కే. ఆయన దీక్షకు సంఘీభావం తెలుపుతూ సోనమ్ వాంగ్‌చుక్ కూడా దీక్షలో పాల్గొన్నాడు.
ఆయన ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అయితే, ఆయన ఒకపక్క పది రోజులుగా ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే.. అభిజీత్ దీప్కే మాత్రం పక్కనే కూర్చుని నూడిల్స్, కచోరితోపాటు బ్రెడ్ పకోడా తింటున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో దీప్కే తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోనమ్ వాంగ్‌చుక్ ఆహారం తీసుకోకుండా ఉంటే, పక్కనే దీప్కే ఎలా తింటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ అంశంపై దీప్కే స్పందించారు. ఇదంతా చిన్న పిల్లల ఆటలా ఉందన్నాడు. తమ స్ఫూర్తిని దెబ్బతీయడానికి చేస్తున్న కుట్రగా చెప్పాడు. ఈ వేదికమీద తాను నూడిల్స్, కచోరీలు తిన్నది.. ఇక్కడ సోనమ్ ఆమరణ దీక్షకు దిగకుముందు అన్నాడు.
తమ దీక్ష ప్రారంభమైనప్పుడు ఆయన విదేశాల్లో ఉన్నారని, వారం తర్వాత వచ్చి ఆయన దీక్షలో కూర్చున్నారని చెప్పారు. ఈ లోపు తాము వేదికమీదే ఆహారం తీసుకున్నామని, అయితే, ఆయన రాకముందు తిన్నప్పుడు తీసిన వీడియోల్ని కొందరు ఇలా ఆయనతో కలిసి ఉన్నప్పుడు తిన్నట్లుగా మార్చి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం సోనమ్ ఒక్కరే దీక్ష చేస్తున్నారని, దీక్ష విరమించాలని తాము కోరినా ఆయన పట్టువీడటం లేదన్నారు. మిగతా సభ్యులు ఎవరూ దీక్షకు దిగొద్దని ఆయన చెప్పారని దీప్కే అన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంపై దీప్కే ఆందోళన వ్యక్తం చేశారు.