MK Stalin | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మండి పడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేకే.. తన ప్రత్యర్థి పార్టీలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. రాష్ట్ర విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ కార్యాలయం, సచివాలయంలోని ఆయన కార్యాలయంలోనూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంగళవారం తనిఖీలు చేశారు. దీనిపై ఎంకే స్టాలిన్ స్పందిస్తూ కేంద్రంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. రాజకీయంగా తన ప్రత్యర్థులను ఎదుర్కోలేక దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నదని స్టాలిన్ పేర్కొన్నారు. ఇటువంటి కేంద్రం బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అధికారం కోల్పోతామన్న భయంతోనే ఈ దాడులకు దిగుతున్నదన్నారు. బీజేపీ అసంబద్ధ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని గుర్తు చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సరైన గుణపాఠం నేర్పుతారని స్పష్టం చేశారు.
దర్యాప్తు సంస్థలకు విచారణలో పూర్తిగా సహకరిస్తామని చెప్పినా.. సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో ఈడీ అధికారులు తనిఖీలు చేయాల్సిన అవసరం ఏమిటని స్టాలిన్ ప్రశ్నించారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మాయని మచ్చ అని వెల్లడించారు.