Tamil Politics : తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన ఇప్పుడు అత్యంత కీలకదశకు చేరుకుంది. మ్యాజిక్ ఫిగర్ 118కి కేవలం ఆరు స్థానాల దూరంలో నిలిచిన విజయ్ (Vijay) టీవీకే పార్టీ (TVK Party).. అధికారం కోసం చేస్తున్న ప్రయత్నాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. డీఎంకే కూటమి (DMK Alliance) లోని వీసీకే (VCK), వామపక్ష పార్టీల (Left parties) నేతలు గురువారం మధ్యాహ్నం స్టాలిన్ (Stalin) ను కలిశారు. టీవీకే పార్టీ తమ మద్దతు కోరుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించారు.
ఈ సందర్భంగా స్టాలిన్ తన మిత్రపక్షాలకు ‘ఫ్రీ హ్యాండ్’ ఇచ్చారు. విజయ్‌కి మద్దతు ఇచ్చే విషయంలో స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చని ఆయన సూచించారు. ఇప్పటికే 5 సీట్లున్న కాంగ్రెస్ మద్దతు తెలుపగా.. ఇప్పుడు రెండేసి సీట్లున్న వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా సానుకూలంగా స్పందిస్తే విజయ్‌ని బలపర్చే ఎమ్మెల్యేల సంఖ్య 118కు చేరుతుంది. దాంతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అవుతుంది. మరోవైపు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ – విజయ్ మధ్య జరుగుతున్న చర్చలు ఉత్కంఠను రేపుతున్నాయి.
ఈరోజు ఉదయం జరిగిన భేటీలో గవర్నర్ పలు కీలక ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. మెజారిటీ లేకుండా ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు? ఏయే పార్టీలు మద్దతు ఇస్తాయో స్పష్టమైన ఆధారాలు ఏవి..? అని ఆయన ప్రశ్నించారు. దీనికి విజయ్ బదులిస్తూ తాను అసెంబ్లీలో ‘ఫ్లోర్ టెస్ట్’కు సిద్ధమని, సభలోనే తన బలాన్ని నిరూపించుకుంటానని ధీమా వ్యక్తంచేశారు. అయితే ప్రమాణ స్వీకారానికి ముందే మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ సూచించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
గవర్నర్ వైఖరిని వీసీకే అధినేత తిరుమావళవన్ తీవ్రంగా తప్పుబట్టారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్‌ని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించకుండా అడ్డుకోవడం అంగీకారయోగ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. బలాబలాలు తేలాల్సింది లోక్‌భవన్ వేదికగా కాదని, అసెంబ్లీ వేదికగా మాత్రమేనని ఆయన అన్నారు.