భోపాల్, అక్టోబర్ 16: ఉన్నత విద్యాసంస్థల్లో హిందీని బోధన భాషగా చేయటంపై కేంద్రప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. దేశంలో తొలిసారి మధ్యప్రదేశ్లో ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలను హిందీలో ముద్రించారు. వీటిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఆవిష్కరించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వైద్య విద్య ప్రాజెక్టులో భాగంగా వీటిని రూపొందించారు. బయోకెమిస్ట్రీ, అనాటమీ, మెడికల్ ఫిజియాలజీ సబ్జెక్టులను హిందీలో తయారుచేశారు. కాగా, హిందీలో ఎంబీబీఎస్ పుస్తకాలు విడుదల కావటం దేశంలో సానుకూల మార్పు తీసుకొస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీకి స్టాలిన్ లేఖ
ఉన్నత విద్యలో ఇంగ్లిష్కు బదులు హిందీ మాధ్యమాన్ని తీసుకురావటంపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది సమాఖ్య వ్యవస్థకు విఘాతమని మండిపడ్డారు. హిందీని బలవంతంగా రుద్దే చర్యలను ఆపకపోతే ఉద్యమం తప్పదని డీఎంకే హెచ్చరించింది.