గువాహటి: దోపిడీ దొంగగా అనుమానించిన (Mistaken identity) పోలీసులు ఒక రైతును కాల్చి చంపారు. సీఐడీ దర్యాప్తులో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. బీజేపీ పాలిత అస్సాంలోని ఉదల్గురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న రౌటా ప్రాంతంలోని ధన్సిరిఖుతి గ్రామంలో పోలీసులు ఒక వ్యక్తిని ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. మృతుడు కెనారామ్ బోరో అలియాస్ కెనారం బాసుమతరీ పెద్ద దోపిడీ దొంగగా పొరబడ్డారు. నిషేధిత నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ మాజీ సభ్యుడైన బోరో అస్సాం, మేఘాలయాల్లో జరిగిన అనేక సాయుధ దోపిడీ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడని పోలీసులు చెప్పారు. పలు సందర్భాల్లో మారణాయుధాలతో అరెస్టయ్యాడని పోలీసు అధికారి తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారని వెల్లడించారు.
కాగా, కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కెనారామ్ బోరోగా అతడి తల్లి గుర్తించిందని పోలీసులు తెలిపారు. దీంతో ఆమెకు అప్పగించగా అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. అయితే పోలీస్ కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి తన కుమారుడు దింబేశ్వర్ ముచహరి అని తల్లి ఆరోపించింది. ఆయన చిన్న రైతు అని ఆమె తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఎన్‌కౌంటర్‌పై సీఎం హేమంత్ బిస్వా శర్మ ఈ నెల 2న సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఎన్కౌంటర్లో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తవ్వి తీశారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా మృతుడు దింబేశ్వర్ ముచహరి అని నిర్ధారణ అయ్యింది.
మరోవైపు పోలీసులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారు. ఎన్కౌంటర్లో చనిపోయిన దింబేశ్వర్ ముచహరి అలియాస్ గోబ్లా కూడా కరుడుగట్టిన నేరస్తుడని పోలీస్ అధికారి తెలిపారు. గతంలో తుపాకులతో సహా అతడు అరెస్టైనట్లు చెప్పారు. కెనారామ్ బోరో, దింబేశ్వర్ ముచహరి కూడా ఒక కేసులో పరారీలో ఉన్న నిందితులని వెల్లడించారు.