Supreme Court | స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. స్వలింగ సంపర్కుల వివాహాలు, భిన్న లింగాలకు చెందిన వారి పెళ్లిళ్లు వేర్వేరుగా ఉంటాయని పేర్కొంది. స్వలింగ సంపర్కులు భాగస్వాములుగా జీవించడం నేరం కాదని, అయితే దీన్ని భర్త, భార్య పిల్లలతో కూడిన భారతీయ కుటుంబ యూనిట్‌తో పోల్చలేమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. స్వలింగ సంపర్కుల వివాహాన్ని ప్రత్యేక వివాహచట్టం కింద గుర్తించాలని కోరుతూ గతంలో సుప్రీంకోర్టులో గతంలో పిటిషన్లు దాఖలయ్యాయి.
హైదరాబాద్‌కు చెందిన అభయ్ దాంగ్, సుప్రియో చక్రవర్తి పిటిషన్ దాఖలు చేశారు. అలాగే పార్థ్ ఫిరోజ్, ఉదయ్ రాజ్ అనే మరో స్వలింగ సంపర్కుల జంట కూడా ఇదే విషయమై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఒకే లింగానికి చెందిన వారనే కారణంతో ఇద్దరి వివాహానికి గుర్తింపు ఇవ్వకపోవడం రాజ్యాంగంలోని 14, 21వ అధికరణల కింద సమానత్వ హక్కును ఉల్లఘించడమేనని పిటిషనర్లు ఆరోపించారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు గుర్తింపు కోరుతూ సుప్రీంకోర్టు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అభిప్రాయాన్ని కోరుతూ చెప్పాలరి కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
ఈ క్రమంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. భారతీయ వ్యక్తి పెళ్లి తర్వాత భర్త అవుతాడని, స్త్రీ భార్య అవుతుందని, దంపతులిద్దరు పిల్లలు పుట్టాక తల్లిదండ్రులవుతారని పేర్కొంది. వివాహచట్టానికి అనేక హక్కులు, బాధ్యతలున్నాయని, నిర్ధిష్ట సామాజిక సంబంధాల కోసం గుర్తింపు పొందడం ప్రాథమిక హక్కు కాదని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే స్వలింగ వివాహ కేసుల్లో గృహహింస చట్టంతో సహా అనేక చట్టపరమైన నిబంధనలను అమలు చేయడం సాధ్యం కాదని చెప్పింది. దేశంలోని వివిధ హైకోర్టుల్లో స్వలింగ వివాహాల పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనానికి బదిలీ చేసుకున్నది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆయా పిటిషన్లపై కేంద్రానికి నోటీసులు జారీ చేయగా.. ఈ మేరకు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.