Ministry of Defence | పాకిస్థాన్ దాడులపై భారత రక్షణ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. జమ్మూ, పఠాన్‌కోట్, ఉధమ్‌పూర్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ దాడులకు పాల్పడిందని వెల్లడించింది. డ్రోన్లు, మిస్సైల్‌తో ఈ దాడులకు తెగబడిందని చెప్పింది. మార్గదర్శకాల ప్రకారం ధీటుగా తిప్పికొడుతున్నామని స్పష్టం చేసింది.
ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. దేశ ప్రజల రక్షణ, సమగ్రతను కాపాడేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నట్లు వెల్లడించింది. కాగా, గురువారం రాత్రి సత్వారీ, సాంబా, ఆర్ఎస్ పురా, ఆర్నియా సెక్టార్లలో పాక్ క్షిపణి దాడులకు ప్రయోగించింది. అయితే పాక్ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. పాకిస్థాన్ ప్రయోగించిన ఎనిమిది మిస్సైల్స్‌ను విరోచితంగా కూల్చివేసింది. అలాగే రాజస్థాన్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-15 యుద్ధవిమానాన్ని కూడా కూల్చివేసినట్లు తెలుస్తోంది. వీటితో పాటు రెండు జేఎఫ్17 యుద్ధ విమానాలను సైతం కూల్చివేసిందని సమాచారం.
Military stations at Jammu, Pathankot & Udhampur were targeted by Pakistani-origin #drones and missiles along the International Border in J&K today.
The threats were swiftly neutralised using kinetic and non-kinetic capabilities in line with established Standard Operating…
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) May 8, 2025
దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకు హైఅలర్ట్
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలను సైరన్లతో భారత సైన్యం అప్రమత్తం చేసింది. ప్రజలంతా తమ నివాసాల్లోనే ఉండాలని సైన్యం హెచ్చరించింది. అఖ్నూర్, కిశ్వార్, సాంబా సెక్టార్లలో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలివేశారు. అలాగే ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. బ్లాక్ అవుట్ పాటిస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకు హైఅలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని భారత విమానయాన శాఖ ఆదేశించింది. విమానాశ్రయ టెర్మినల్ భవనాల్లో సందర్శకులను అనుమతించవద్దని సూచించింది.