బెంగళూరు, ఏప్రిల్ 19: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన మరో మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో దళితుడు ముఖ్యమంత్రి అయ్యేందుకు సమయం ఇంకా రాలేదంటూ మంత్రి మునియప్ప శనివారం వ్యాఖ్యానించారు. ఈ విషయం గురించి మాట్లాడేందుకు ఇది సమయం కాదని, ముఖ్యమంత్రి పదవిలో సిద్ధరామయ్య కొనసాగుతారని ఆయన అన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి నియామకంతో సహా అన్ని వ్యవహారాలపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని, అందరూ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని ఆయన చెప్పారు. సమయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా తమకు అవకాశం ఇవ్వాలని దళితులు కోరుకుంటున్నారని ఆయన వెల్లడించారు. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుందని దళిత సీనియర్ నాయకుడైన మునియప్ప విలేకరుల ప్రశ్నకు జవాబిచ్చారు.