ఇంఫాల్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి ముంబై వరకూ చేపట్టే భారత్ న్యాయ్ యాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఈ యాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. మార్చి 20 లేదా మార్చి 21న ఈ యాత్ర ముగియనుండగా 15 రాష్ట్రాల్లోని 100 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా సాగుతుంది.
మణిపూర్, నాగాలాండ్, అరుణాల్ ప్రదేశ్, మేఘాలయ, అసోం, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘఢ్, రాజస్ధాన్ రాష్ట్రాల మీదుగా మహారాష్ట్రలో యాత్ర ముగుస్తుంది. ఇక ఇంఫాల్‌కు బదులు తౌభాల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ మైదానం వేదికగా రాహుల్ యాత్ర ప్రారంభం కానుంది. ఇక రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రకు ముందు ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత మురళి దియోర కుమారుడు మిలింద్ దియోర (Milind Deora) కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.
పార్టీతో తమ కుటుంబానికి 55 ఏండ్ల అనుబంధం ముగిసిపోయిందని, తన రాజకీయ చరిత్రలో కీలక అధ్యాయానికి తెరపడిందని మిలింద్ దియోర వెల్లడించారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. తనకు సహకరించిన పార్టీ నేతలు, సహచరులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ట్విట్టర్ వేదికగా మిలింద్ దియోర తెలిపారు.
అభివృద్ధి రాజకీయాల దిశగా తన తదుపరి అడుగులు ఉంటాయని చెప్పారు. ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన మద్దతు దారులతో సంప్రదించిన అనంతరం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని, ఈ దిశగా ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
Read More :
Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌పై డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన కంగనా