న్యూఢిల్లీ, జూలై 10: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి ఈ20 పేరుతో అమ్ముతున్న ఇథనాల్ మిశ్రమ ఇంధనంపై దేశవ్యాప్తంగా వాహనదారుల నుంచి ప్రతిఘటన ఎదురవుతున్నది. ఇప్పటికే దీనిపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వాహనదారుల ఆధ్వర్యంలో ధర్నా కూడా జరిగింది.ఈ సందర్భంగా దేశంలోని వివిధ వర్గాల నుంచి వస్తున్న కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు కేంద్రం సమాధానమిచ్చింది.
ప్రశ్న: ఈ20 ఇంధనంతో మైలేజ్ తగ్గుతుందా?
కేంద్రం: కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఇంధన సామర్థ్యం 3 నుంచి 5 శాతం తగ్గినట్టు కొందరు వాహనదారులు చెబుతున్నారు. అయితే ఈ ఇంధన వాడకం కారణంగా లభించే ఇతర ప్రయోజనాలతో పోలిస్తే ఇది స్వల్పమే. ఈ20 ఇంధనంతో ఉద్గారాలు తగ్గుతాయి. దీని ద్వారా రైతులకు ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది.
ప్రశ్న: వాహన ఇంజిన్లు, పాత వాహనాలు దీని కారణంగా పాడవుతున్నాయా?
కేంద్రం: ఈ వాదనలకు మద్దతుగా విస్తృతమైన ఆధారాలు లేవు. ఈ20 ప్రవేశానికి ముందే ఆటోమొబైల్ తయారీదారులు, ద ఆటోమెటీవ్ రిసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఆర్ఏఐ), ఎస్ఐఏఎం, దీనిపై విస్తృతంగా పరీక్షలు చేశాయి.
ప్రశ్న: ఇథనాల్ మిశ్రమ ఇంధనం విషయంలో ప్రభుత్వం తొందరపడిందా?
కేంద్రం: లేదు. ఈ కార్యక్రమం గత రెండు దశాబ్దాలుగా సాగుతున్నది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2021లో ప్రారంభమైంది. అయితే అధికారికంగా 2004లో మొదలుపెట్టాం. ఈ20ని ప్రవేశపెట్టే ముందు ఆటోమొబైల్ తయారీదారులు, చమురు కంపెనీలు, సాంకేతిక నిపుణులు, కన్సల్టెంట్లను విస్తృతంగా సంప్రదించాం.
ప్రశ్న: సంప్రదాయ పెట్రోల్ కన్నా ఈ20 ఎందుకు చవక కాదు?
కేంద్రం: వాస్తవానికి సాధారణ పెట్రోల్ కన్నా ఈ20ని ఉత్పత్తి చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. మక్కజొన్న నుంచి తీసే ఇథనాల్ తయారీకి జీఎస్టీ, రవాణా, సరుకు నిల్వ, హ్యాండ్లింగ్ చార్జీలు కాకుండా లీటర్‌కు రూ. 71.86 ఖర్చవుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధర బ్యారెల్‌కు 70 డాలర్లు ఉందనుకుంటే.. మనం తయారు చేసే ఈ20కి దాని కన్నా ఎక్కువ ఖర్చవుతుంది. ఇథనాల్ మిశ్రమ ఇంధనం కారణంగా 20 శాతం చమురును సొం తంగా తయారు చేసుకోగలుగుతున్నాం.
ప్రశ్న: వాహనదారులకు ప్రభుత్వం ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నది?
కేంద్రం: ఈ20 అనేది శాస్త్రీయంగా ధ్రువీకరించిన, సురక్షితమైన ఇంధనం. దీని నాణ్యతను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిబంధనల ప్రకారం పర్యవేక్షిస్తాం. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు, ప్రచారాన్ని నమ్మవద్దు.