న్యూఢిల్లీ : మైక్రోసాఫ్ట్ హాట్‌మెయిల్ గురువారం ఉదయం నుంచి డౌన్ అయింది. భారత్, బ్రిటన్, అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియాల్లోని వ్యక్తిగత, వ్యాపార యూజర్లపై ఈ ప్రభావం పడింది. ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్‌డిటెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం, తాము లాగిన్ కాలేకపోతున్నామని కొందరు, లైసెన్స్ ఎర్రర్స్ వస్తున్నాయని మరికొందరు చెప్పారు.
మైక్రోసాఫ్ట్ సర్వర్లకు కనెక్ట్ కావడం లేదని కొందరు తెలిపారు. గురువారం రాత్రి 9.15 గంటల వరకు 2,800 ఫిర్యాదులు వచ్చాయి. చాలా మంది యూజర్లు రెడిట్, ఎక్స్ వంటి మాధ్యమాల ద్వారా తమ ఇబ్బందులను తెలియజేశారు.
లాగిన్ స్క్రీన్ కదలడం లేదని, పాస్‌వర్డ్‌ను రీఎంటర్ చేయాలని మెసేజ్ వస్తున్నదని, లైసెన్స్ వ్యావేలిడేషన్ ఫెయిలైందని మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపారు. ఈ సమస్యకు కారణాలేమిటో మైక్రోసాఫ్ట్ వెల్లడించలేదు. అప్పుడప్పుడు అంతరాయాలు ఏర్పడినట్లు మాత్రమే తెలిపింది.