న్యూయార్క్, జనవరి 18: కొత్త ఏడాదిలోనూ ఐటీ రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. తమ సంస్థలో 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో ఇది 5 శాతమని ఆ సంస్థ సీఈవో సత్యనాదెళ్ల బుధవారం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. పెరుగుతున్న వ్యయాలు, తగ్గుతున్న రెవెన్యూ, కస్టమర్ డిమాండ్ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ ఏడాది మూడో త్రైమాసికానికల్లా 10 వేల మంది తొలగింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. తొలగింపునకు గురవుతున్న ప్రతి ఉద్యోగికి ఇది పరీక్షా సమయమని ఆయన వ్యాఖ్యానించారు. 2022 నుంచి టెక్ ఇండస్ట్రీకి గడ్డుకాలం దాపురించింది. అమెరికా సహా పలు దేశాల్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలతో పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేరెంట్ కంపెనీ అయిన మెటా ఇప్పటికే 11 వేలు, అమెజాన్ 18 వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించాయి.