న్యూఢిల్లీ, జనవరి 21: కృత్రిమ మేధ (ఏఐ) భవిష్యత్తుపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మంగళవారం అరుదైన హెచ్చరిక చేశారు. ఏఐ పెద్ద టెక్ కంపెనీలు, సంపన్న ఆర్థిక వ్యవస్థలకే పరిమితమై ఇతర ప్రాంతాలకు విస్తరించకపోతే ఇప్పుడు కొనసాగుతున్న ఏఐ బూమ్ ఓ బుడగగా మారే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశంలో సత్య నాదెళ్ల మాట్లాడుతూ ఏఐ దీర్ఘకాలిక విజయం విస్తృత శ్రేణి పరిశ్రమలు ఉపయోగిస్తున్న టెక్నాలజీ, అభివృద్ధి చెందిన పపంచం వెలుపల ఉన్న దేశాలు దీన్ని స్వీకరించడం మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఏఐ బూమ్ ఒక బుడగలా ఉండకూడదంటే దీని ప్రయోజనాలు మరింత సమానంగా వ్యాప్తి చెందడం అవసరమని ఆయన చెప్పారు.
ఏఐ చర్చలు పరిశ్రమలోని వివిధ రంగాలు స్వీకరించడానికి బదులుగా కేవలం సరఫరా లేదా టెక్నాలజీ కంపెనీల వైపు మాత్రమే దృష్టి సారిస్తే అది బుడగకు నిర్వచనంగా మారుతుందని నాదెళ్ల అన్నారు. అన్ని రకాల పరిశ్రమలకు ఏఐ బదిలీ అవుతుందని తాను విశ్వసిస్తున్నట్లు బ్లాక్రాక్ చైర్, సీఈవో లారెన్స్ డీ ఫింక్తో మాట్లాడుతూ సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. ఇది ఆర్థిక వృద్ధిని తీసుకువచ్చే టెక్నాలజీగా తాను నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు. కీలకమైన మందులను మార్కెట్లోకి వేగంగా తీసుకురావడానికి లేదా ఫార్మా కంపెనీలు తమ ప్రయోగాలను వేగవంతం చేయడానికి ఇది ఎలా సహాయపడుతుందో అలాగే జీవితంలోని అన్ని అంశాల్లో ఏఐ పాత్రను పరిశీలించాల్సిన అవసరం ఉందని నాదెళ్ల అన్నారు. కేవలం ఖర్చును పెంచడం కంటే ఏఐ ఆధారిత ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐ, ఇతర అధునాతన సాంకేతికలు ఉత్పాదకతను ఎలా పెంచుతున్నాయో, పనిచేసే విధానాన్ని ఎలా పునర్ రూపొందిస్తున్నాయో ఆయన వివరించారు.