న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన 23 మందిని.. యూఏపీఏ చట్టం కింద ఉగ్రవాదుల జాబితాలో ప్రభుత్వం చేర్చింది. దీనిపై కేంద్ర హోంశాఖ(Ministry of Home Affairs) ఇవాళ ప్రకటన చేసింది. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు ఆ 23 మందిలో ఉన్నారు. యూఏపీఏ సెక్షన్ 35 కింద ఆ 23 మందిని ఉగ్రవాదులుగా తేల్చింది. రిక్రూట్మెంట్, ట్రైనింగ్, చొరబట్లు, లాజిస్టిక్స్ మద్దతతో ఆయుధాలు, డ్రోన్ ఆధారిత వెపన్స్ సరఫరా చేస్తున్నట్లు ఆ ఉగ్రవాదులపై ఆరోపణలు ఉన్నాయి. భారత్‌పై దాడులకు కూడా వాళ్లు ప్లాన్ వేసినట్లు తెలిసింది. యూఏపీఏ జాబితాలో చేరడం వల్ల ఆ ఉగ్రవాదులకు నిధులను ఎన్ఐఏ అడ్డుకుంటుంది. 2019లో యూఏపీఏ చట్టాన్ని సవరణ చేశారు. అంతకుముందు కేవలం ఉగ్ర సంస్థలను మాత్రమే నిషేధిత జాబితాలో ఉంచేవారు. ఇప్పుడు ఉగ్రవాదులను వ్యక్తిగతంగా కూడా అడ్డుకుంటున్నారు. 23 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు ఇటీవల జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలపై జరిగిన దాడులకు కారణమయ్యారు. అయితే యూఏపీఏ జాబితాలో ఉగ్రవాదుల సంఖ్య ఇప్పుడు 80కి చేరింది.