Mehbooba Mufti : జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల దుశ్చర్యలు కొనసాగుతున్న క్రమంలో పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. విధులు నిర్వర్తించేందుకు దేశవ్యాప్తంగా సైనికులు కశ్మీర్‌కు వస్తారు కానీ వారు శవపేటికల్లో తిరిగి వెళతారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లోయలో ఉగ్రవాదం సమసిపోయిందని మీరు చెబుతుంటే మరి ఈ ఘటనలకు ఎవరు బాధ్యత వహించాలని ఆమె కాషాయ పాలకులను ప్రశ్నించారు.
డీజీపీ నియామకం తర్వాత గత 32 నెలల్లో పెద్దసంఖ్యలో సైనికులు మరణించారని, సరిహద్దుల్లో మీరు (కేంద్ర ప్రభుత్వం) పహారా కాస్తుంటే చొరబాట్లను ఆపే బాధ్యత ఎవరిదని మెహబూబా ముఫ్తీ నిలదీశారు. ఇది ప్రాంతీయ పార్టీల బాధ్యతా అని ఆమె ప్రశ్నించారు. కశ్మీర్లో సాధారణ పరిస్ధితులు నెలకొన్నాయని గత ఆరేండ్లుగా కేంద్ర పాలకులు చెబుతున్నారని, కానీ పరిస్ధితి అందుకు విరుద్ధంగా ఉందని ఆమె అన్నారు.
ఈ పరిస్ధితుల్లో మీరు సాధించిందేమిటంటూ కేంద్రాన్ని నిలదీశారు. ఉత్తర కశ్మీర్లో మీకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని వ్యాఖ్యానించారు. కాగా, జమ్ముకశ్మీర్‌లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. దోడా జిల్లాలోని దెసా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత సైన్యం, స్థానిక పోలీసులు సోమవారం రాత్రి 7.45 గంటలకు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో టెర్రరిస్టులు, భద్రతాసిబ్బందికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఆర్మీ సిబ్బందితోపాటు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దవాఖానకు తరలించగా ఆర్మీ అధికారితోపాటు మరో ముగ్గురు జవాన్లు మరణించారని అధికారులు తెలిపారు.
Read More :