Sofia Firdous | భువనేశ్వర్ : ఒడిశా రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారిగా ఓ ముస్లిం మహిళా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున కటక్ అసెంబ్లీ నుంచి సోఫియా ఫిర్దౌస్ గెలుపొందారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పూర్ణ చంద్ర మహాపాత్రపై 8,001 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
సోఫియా ఫిర్దౌస్ వయసు 32 ఏండ్లు. ఆమె తండ్రి మహ్మద్ మోఖీం.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. మొన్నటి వరకు కటక్ నుంచి మహ్మద్ మోఖీం ఎమ్మెల్యేగా కొనసాగారు. తండ్రి స్థానంలో కూతురు సోఫియాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది.
ఫిర్దౌస్.. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. బెంగళూరులోని ఐఐఎంబీ నుంచి 2022లో ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశారు.
2023లో కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసిసియేషన్ ఆఫ్ ఇండియా (CREDAI) భువనేశ్వర్ చాప్టర్‌కు అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. క్రెడాయ్ ఉమెన్స్ వింగ్ ఈస్ట్ జోన్ కోఆర్డినేటర్‌గా ఆమె సేవలందించారు.
సీఐఐ – ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) భువనేశ్వర్ చాప్టర్‌కు కో- చైర్మన్‌గా, INWEC ఇండియా కోర్ మెంబర్‌గా పని చేశారు. ఆమె పారిశ్రామికవేత్త షేక్ మెరాజ్ ఉల్ హక్‌ను వివాహం చేసుకుంది.
1972లో అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఒడిశా మొదటి మహిళా ముఖ్యమంత్రి నందిని సత్పతి అడుగుజాడల్లో ఆమె నడుస్తోంది.