చెన్నై, జూన్ 27: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేతో తొమ్మిదేండ్లుగా కొనసాగుతున్న బంధాన్ని ఎండీఎంకే అధికారికంగా తెంచుకుంది. శనివారం జరిగిన పార్టీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అధికార టీవీకే నేతృత్వంలోని కూటమిలో చేరుతున్నట్టు సంకేతాలు ఇచ్చింది. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఎండీఎంకే తీర్మానాలు చేసింది.
అవినీతి రహిత పాలన, మేకెదాటు డ్యామ్ వంటి అంశాల్లో తమిళనాడు హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం రాజీలేని వైఖరిని కొనసాగించాలని కోరింది. టీవీకే కూటమిలో చేరికపై ప్రస్తావన లేనప్పటికీ, ఇవి ఆ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. డీఎంకేలో కొనసాగలేని పరిస్థితులు ఉన్నాయని ఎండీఎంకే ఆరోపించింది. ‘మా పార్టీని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచించారు’ అంటూ ఏండీఎంకే తన తీర్మానంలో ఆరోపించింది.