భోపాల్: నూడుల్స్ ఆర్డర్ అంశంపై ఎంబీబీఎస్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రాడ్లు, కర్రలతో రెండు గ్రూపుల స్టూడెంట్స్ కొట్టుకున్నారు. ఇద్దరు మెడికోలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నేపథ్యంలో 15 మంది మెడికల్ విద్యార్థులను సస్పెండ్ చేశారు. (MBBS Students Clash Over Noodles) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 4న ఎయిమ్స్ భోపాల్‌లో జరిగిన రెటీనా ఫెస్ట్ అనంతరం గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థులు అర్ధరాత్రి వేళ క్యాంపస్‌కు తిరిగి వచ్చారు. కొందరు మద్యం మత్తులో ఉన్నారు. ఒక కేఫ్ వద్ద నూడుల్స్ ఆర్డర్ ఇచ్చారు.
కాగా, నూడుల్స్ మొదట ఎవరు పొందాలి అన్నదానిపై స్టూడెంట్స్ మధ్య ఘర్షణ జరిగింది. 2024 బ్యాచ్‌కు చెందిన పరాస్‌ను సుమారు 15 మంది విద్యార్థులు చుట్టుముట్టారు. కర్రలతో అతడ్ని కొట్టారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్ శైలేష్ చౌదరి జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. చేతికి, భుజానికి గాయాలైన పరాస్‌ను చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేశారు. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు.
మరోవైపు గాంధీ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించింది. డిసెంబర్ 5న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. 15 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను సస్పెండ్ చేసింది. హాస్టల్‌ను వెంటనే ఖాళీ చేయాలని వారిని ఆదేశించింది. క్యాంపస్‌లో హింసను సహించబోమని, కఠినమైన చర్యలు తీసుకుంటామని డీన్ అయిన డాక్టర్ కవితా ఎన్ సింగ్ హెచ్చరించారు.
Also Read:
Watch: మృతదేహాన్ని వేరే ప్రాంతంలో పడేసిన పోలీసులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: స్కూల్‌కు వెళ్లకుండా ఉండేందుకు.. బాలుడు ఏం చేశాడంటే?