న్యూఢిల్లీ: వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు ఇది శుభవార్తే. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ల(MBBS Seats) సంఖ్య పెరిగింది. 2025తో పోలిస్తే ఈ యేడాది సుమారు 7 శాతం సీట్లు పెరిగినట్లు తెలుస్తోంది. దేశంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1.36 లక్షలకు చేరుకున్నది. గత ఏడాది దేశవ్యాప్తంగా 1,28,976 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవి. 2025-26 వార్షిక సంవత్సరానికి 818 మెడికల్ కాలేజీల్లో ఆ సంఖ్య ఉండేది. ఇక కొత్త వార్షిక సంవత్సరం 2026-27 సీజన్లో దేశవ్యాప్తంగా ఉన్న 823 కాలేజీల్లో 136939 మెడికల్ సీట్లు ఉన్నట్లు తెలిసింది. దీంట్లో 441 ప్రభుత్వ, 382 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్లలో 1,27,028 సీట్లు రెన్యువల్ సిస్టమ్ ద్వారా రాగా, ఇక కొత్తగా మరో 9911 సీట్లు జత కలిసినట్లు తెలిసింది.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 63,296 సీట్లు ఉండనున్నాయి. దీంట్లో 61,185 సీట్లు రెన్యువల్ కాగా, 2111 సీట్లు కొత్తవి. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 73,643 సీట్లు ఉండనున్నాయి. దీంట్లో 65,843 సీట్లు రెన్యువల్ కాగా, 7800 కొత్త సీట్లు ఉంటాయి. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ఈ కొత్త వివరాలను వెల్లడించింది. 2026-27 వార్షిక విద్యా సంవత్సరం కోసం ఎన్ఎంసీ ఈ వివరాలను ప్రకటించింది. ఎయిమ్స్, జిప్మర్ పుదుచ్చరి, పీజీఐ చండీఘడ్ లాంటి విద్యాసంస్థలను ఈ జాబితాను నుంచి మినహాయించారు. కౌన్సిల్ ప్రక్రియకు ముందు మెడికల్ కౌన్సిల్ కీలక సమాచారాన్ని చేరవేసింది. అయితే కేంద్ర వైద్య విద్యా సంస్థల్లో ప్రతి ఏడాది సుమారు 2900 సీట్లకు కౌన్సిలింగ్ చేస్తుంటారు. అయితే ఎన్ఎంసీ డేటా ప్రకారం ఈ ఏడాది కొత్తగా మొత్తం 7963 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉండనున్నట్లు తెలిసింది.