న్యూఢిల్లీ జూలై 27 : భరించే వాడినే భర్త అందురు అని ఆ యువతికి ఎవరు నూరిపోశారో కాని ఆమె కోరుకున్న విలాస జీవితం కట్టుకున్న భర్తను దొంగగా మార్చి జైలు పాలుచేసింది. విలాస వస్తువులు కోరుకుంటున్న భార్యను సంతోషపెట్టేందుకు ఓ ప్రైవేట్ కంపెనీలో చేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాన్ని వదిలేసి దొంగగా మారిన ఆ ఎంబీఏ గ్రాడ్యుయేట్ చివరకు శ్రీకృష్ణ జన్మస్థానాన్ని సందర్శించాల్సిన దుస్థితి దాపురించింది.
రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా జామ్వరాంగఢ్ గ్రామానికి చెందిన తరుణ్ ప్రతీక్‌కి నెలరోజుల క్రితం వివాహమైంది. తన భార్య ఖరీదైన కోర్కెలను తీర్చాలంటే వస్తున్న జీతం సరిపోవడం లేదు. దీంతో ఆ ఉద్యోగాన్ని మానేసి ఫుల్‌టైమ్ చోరవృత్తిని ఎంచుకున్నాడు. అయితే దురదృష్టం అతడిని వెంటాడింది. జైపూర్‌లోని ట్రాన్స్‌పోర్టు నగర్ ప్రాంతంలో పట్టపగలు ఓ వృద్ధ మహిళ మెడలో నుంచి బంగారం గొలుసు లాక్కుని తరుణ్ పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా శుక్రవారం జైపూర్ చేరుకున్న తరుణ్‌ని అరెస్టు చేశారు.