న్యూఢిల్లీ, మార్చి 12: కేంద్ర ప్రభుత్వంపై అన్ని వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. పంటలకు మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నా కేంద్రానికి పట్టడం లేదని.. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారని మండిపడుతున్నాయి. మోదీ పాలన కార్పొరేట్లకే ‘అమృత్కాల్’ తప్ప సామాన్యులకు కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు భారీ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 5న దేశ రాజధాని ఢిల్లీకి ‘మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీ’ పేరుతో ఆయా సంఘాలు మార్చ్ నిర్వహించనున్నాయి. ఈ ర్యాలీలో లక్షలాది మంది పాల్గొంటారని, 2018, సెప్టెంబర్ 5న కనిపించిన దృశ్యం మళ్లీ రిపీట్ అవుతుందని నేతలు చెబుతున్నారు.
కార్పొరేట్ అనుకూల విధానాలతో వినాశనం
కేంద్రం రైతులు, కార్మికులను దోపిడీ చేస్తూ.. కార్పొరేట్లకు లబ్ధి చేకూరుస్తున్నదని సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శులు తపన్‌సేన్, విజూ కృష్ణన్, బీ వెంకట్ విమర్శించారు. మోదీ సర్కార్ కార్పొరేట్ అనుకూల విధానాలు తీవ్ర వినాశనానికి దారితీస్తున్నాయని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్యను పట్టించుకోవడం లేదని, కార్మికుల చట్టబద్ధమైన హక్కులను నిర్వీర్యం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నదని అన్నారు.
ఎంఎస్పీకి చట్టబద్ధత హామీ గాలికి!
రైతాంగ ఉద్యమ విరమణ సమయంలో కనీస మద్దతు ధరకు చట్టబద్ధత విషయంలో రైతు సంఘాలకు ఇచ్చిన హామీని కేంద్రం తుంగలో తొక్కిందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేస్తూ.. ప్రజల హక్కులను కాలరాసే పనిలో కేంద్రం ఉన్నదని పేర్కొన్నారు. అధికార బీజేపీ విధానాలను వ్యతిరేకించినా, అసమ్మతి వ్యక్తం చేసినా.. యూఏపీఏ వంటి క్రూరమైన చట్టాలను ప్రయోగిస్తూ అణచివేస్తున్నారని ఆక్షేపించారు.