న్యూఢిల్లీ : యూపీ ఫలితాలతో బీఎస్పీ శ్రేణులు నిరుత్సాహానికి లోనుకారాదని ఆ పార్టీ చీఫ్ మాయావతి కోరారు. ఓటమి నుంచి మనం గుణపాఠాలు నేర్చుకుని తిరిగి అధికారంలోకి వచ్చేలా ఆత్మ పరిశీలన చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.మీడియా కుల విద్వేష వైఖరి అవలంభిస్తోందని ఆరోపించిన ఆమె టీవీ డిబేట్లను తమ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మీడియా తమ బాస్ల సూచనలకు అనుగుణంగా అంబేద్కర్ వాదీ బీఎస్పీ ఉద్యమాన్ని దెబ్బతీసేలా కులవిద్వేష వైఖరిని అనుసరించిందని మాయావతి దుయ్యబట్టారు.
మీడియా తీరుకు నిరసనగా తమ పార్టీ ప్రతినిధులు సుధీంద్ర బదౌరియ, ధరంవీర్ చౌధరి, ఎంహెచ్ ఖాన్, ఫైజన్ ఖాన్, సీమ కుష్వాహ టీవీ చర్చల్లో ఇక పాల్గొనబోరని మాయావతి వరుస ట్వీట్లలో స్పష్టం చేశారు. కుల మీడియా ముస్లింలను తమకు దూరం చేసిందని సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వస్తే ఆటవిక రాజ్యం వస్తుందని భయపెట్టి తమ మద్దతుదారులను బీజేపీకి ఓటు వేసేలా ప్రేరేపించిందని ఆమె ఆరోపించారు.
ఎస్పీ అధికారంలోకి వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయోననే ఆందోళనతో తమ పార్టీకి మద్దతుఇచ్చే అగ్రవర్ణాలు, బీసీలు, ఇతర కులాలు బీజేపీ వైపు మళ్లేలా మీడియా వ్యవహరించిందని దుయ్యబట్టారు. యూపీ ఫలితాలతో బీఎస్పీ శ్రేణులు నిరుత్సాహానికి లోనుకారాదని మాయావతి కోరారు. ఓటమి నుంచి మనం గుణపాఠాలు నేర్చుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.