న్యూఢిల్లీ, అక్టోబర్ 6: టిబెట్‌లోని ఎవరెస్ట్ పర్వతంపై ఏర్పడిన భారీ మంచు తుఫాన్లో పెద్దఎత్తున యాత్రికులు చిక్కుకున్నారు. సుమారు 1000 మంది వరకు పర్వతంపై ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్నారని తెలిసింది. వీరిలో 350 మందిని సహాయ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయని సమాచారం. ఒకరు మరణించినట్టు చైనా మీడియా ప్రకటించింది. మిగిలిన వారిని కూడా కాపాడేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. తీవ్రమైన పరిస్థితుల్లో చిక్కుకున్న వారిలో మరో 200 మందితో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించింది. రక్షణ బృందాలతోపాటు స్థానికులు కూడా భారీఎత్తున పేరుకుపోయిన మంచును తొలగించేందుకు సహకరిస్తున్నట్టు తెలిపింది. మంచు తుఫాన్ దృశ్యాలు చూస్తుంటే అసాధారణంగా అనిపిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ నెలలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పట్ల ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.