Jaisalmer : రాజస్థాన్‌ను మరోసారి ఇసుకు తుపాన్ ముంచెత్తింది. జైసల్మేర్ పరిధిలో భారీ ఇసుక తుపాన్ రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జైసల్మేర్ జిల్లాలోని రామ్‌గఢ్, మోహన్‌గఢ్, పీటీఎం టౌన్, నచ్నా సహా అనేక సరిహద్దు ప్రాంతాల్లో ఆదివారం ఇసుకు తుపాన్ ముంచెత్తింది. ఇండియా–పాకిస్తాన్ సరిహద్దులో ఈ ఇసుకు తుపాన్ కారణంగా ఆకాశం మొత్తం ఇసుకతో నిండింది.
ఎదురుగా ఏముందో కూడా కనిపించనంతగా ఇసుక కమ్మేసింది. చాలా ఎత్తున ఇసుక ఎగసిపడింది. పగటి వేళలో ఇలా ఇసుక ఎగసి, ఆ ప్రాంతాల్ని మొత్తం చీకటిమయంగా చేసేసింది. కొన్ని కిలోమీటర్ల మేర ఈ ఇసుక తుపాన్ వ్యాపించింది. ఇసుక తుపాన్ కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇండ్లలోకి ఇసుక వచ్చి చేరింది. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై ఏమీ కనిపించకపోవడంతో పగటిపూటే హెడ్ లైట్ల వెలుగుల మధ్య వాహనాలు నెమ్మదిగా ప్రయాణించాల్సి వచ్చింది. అయితే, ఉన్నట్లుండి వాతావరణం మారిపోవడంతో ఒక్క మేలు జరిగిందని స్థానికులు అంటున్నారు. ఎండ ప్రభావం నుంచి ఈ ఇసుకు తుపాన్ కాస్త తెరపి ఇచ్చిందని స్తానికులు చెప్పారు. రాజస్తాన్‌లో ఇసుక తుపాన్ రావడం వరుసగా ఇది రెండోసారి.
శనివారం కూడా పలు ప్రాంతాల్లో ఇసుకు తుపాన్ వచ్చింది. మరోవైపు ఈ ప్రాంతంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, కొన్ని చోట్ల వర్షాలు కూడా పడుతాయని తెలిపింది. బికనేర్, జైపూర్, అజ్మేర్, భరత్పూర్, కోట, జోధ్‌పూర్, ఉదయ్ పూర్ ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.