లక్నో: అయోధ్యలోని శ్రీరామ మందిరంలో కానుకల దొంగతనంపై విచారణ ముమ్మరమైనది. ఈ కేసులోని ఎనిమిది మంది నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లా తామంతా ఒక వ్యవస్థీకృత ముఠా తరహాలో పనిచేసినట్టు పోలీసుల విచారణలో అంగీకరించాడు. పోలీస్ రిమాండ్‌లో ఉన్న శుక్లా శుక్రవారం పలు రహస్యాలను వెల్లడించాడు. 8 మంది నిందితులు ప్రతిరోజూ సాయంత్ర కోసి పరిక్రమ మార్గ్ సమీపంలో సమావేశమై దొంగిలించిన కానుకల సొమ్మును సమానంగా పంచుకొనేవారమని, కొందరు వ్యక్తులు పెద్దమొత్తంలో వాటాలు తీసుకొనేవారని వెల్లడించాడు.
దొంగిలించిన డబ్బుతో తన పేరిట, తన సోదరుడి పేరిట భూమిని మరొక వాహనాన్ని కొనుగోలు చేసినట్టు చెప్పాడు. సహ నిందితుడైన సుభాష్ శ్రీవాస్తవ ఆర్థిక సహాయంతో ఇల్లు కూడా కట్టుకొన్నట్టు ఒప్పుకొన్నాడు. నిందితులు దొంగిలించిన డబ్బును బ్యాంకు ఖాతాల్లో ఉంచలేదు. బదులుగా వారు ఆ డబ్బును స్థిర, చరాస్తుల్లో పెట్టుబడిగా పెట్టారు. నిందితుల్లో ఒకరైన లవ్‌కుశ్ మిశ్రా తన భార్య పేరిట భూమి కొనుగోలు చేశాడు. నగరంలో ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. అనుకల్ప్ నోయిడాలో తన మామ బిజేంద్ర మిశ్రా పేరిట ఫ్లాట్ కొన్నాడు.
లక్నోలో భూమి కొనడానికి ఒక బంధువుకు డబ్బు అప్పుగా ఇచ్చాడు. ఇతర కుటుంబసభ్యులకు కూడా ఆర్థిక సహాయం అందించాడు. రామ్‌శంకర్ యాదవ్ భూమి, గృహ నిర్మాణ రంగంలో పెట్టుబడి పెట్టాడు. మొత్తం దొంగతనానికి సూత్రధారి టిన్నూ యాదవ్ అని, తమకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని పదేపదే భరోసా ఇచ్చేవాడని శుక్లా చెప్పాడు. గ్రూప్ సభ్యులంతా యాదవ్, సహనిందితుడు సుభాష్‌ను పూర్తిగా నమ్మారని, అలాగే తాము పలుమార్లు ఆలయ సీసీటీవీ ఫుటేజీలను డిలీట్ చేసినట్టు శుక్లా ఒప్పుకొన్నాడు.
అయోధ్య విరాళాల కేసు గురించి తాను ప్రధాని మోదీతో మాట్లాడానని బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వినయ్ కత్యార్ అన్నారు. ‘నేను నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడాను. ఆయనకు ఏం జరిగిందో వివరించా. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా ఎందుకు తప్పుకున్నారని అడిగాను. వాళ్లు త్వరలో జైలుకెళ్తారని ప్రధాని చెప్పారు’ అని వినయ్ చెప్పుకొచ్చారు. చంపత్ రాయ్ రామజన్మభూమి తీర్థ ట్రస్టు ప్రధాన కార్యదర్శి పదవికి, అనిల్ మిశ్రా ట్రస్టు సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 8 మంది అరెస్టయ్యారు. మరింత మందిని త్వరలోనే అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కత్యార్ మాటలు చర్చనీయాంశంగా మారాయి.