బాలాసోర్ : బీజేపీ పాలిత ఒడిశాలో హెచ్‌వోడీ లైంగిక వేధింపులు తాళలేక విద్యార్థిని నిప్పంటించుకుని మృతిచెందిన ఘటనపై రాష్ట్రంలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం మోహన్ చరణ్ మాఝీ, విద్యా శాఖ మంత్రి సూర్యవంశి సూరజ్ రాజీనామా చేయాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలంటూ ప్రతిపక్ష బీజేడీ బుధవారం బాలాసోర్ బంద్ చేపట్టింది.
భువనేశ్వర్‌లోని రాష్ట్ర సెక్రటేరియట్ ‘లోక్ సేవా భవన్’ ముట్టడికి బీజేడీ శ్రేణులు ప్రయత్నించారు. సెక్యూరిటీ బారికెడ్లను దాటుకొని సెక్రటేరియట్ వైపు కార్యకర్తలు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులపై పోలీసులు టియర్‌గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ కరువైందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.