న్యూఢిల్లీ, జూన్ 6: మేక్ ఇన్ ఇండియా అడిగితే లీక్ ఇన్ ఇండియా ఇస్తారా అని యువత కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీబీఎస్, నీట్ తదితర పరీక్షల్లో అవకతవకలపై ప్రభుత్వ తీరుని నిరసించారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం భారీ భద్రత నడుమ ప్రణాళిక ప్రకారం కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో వందలాది విద్యార్థులు, యువత పాల్గొన్నారు. వివిధ పరీక్షల్లో జరిగిన అవకతవకల ఆరోపణలపై రాజీనామా చేయడం సహా తమ డిమాండ్లను పరిష్కరిండం కంటే తమ సంస్థకు చెందిన సోషల్ మీడియా కార్యకలాపాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఆన్లైన్ ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కె ఈ సందర్భంగా విమర్శించారు.
మిత్రులారా, ఇది ఒక సుదీర్ఘ పోరాటం. సోషల్ మీడియాలో ప్రధాన్ రాజీనామాను మనం డిమాండ్ చేయడం మొదలుపెట్టి నెల రోజులైంది. కానీ ఈ వ్యక్తులు ఎంత సిగ్గులేనివారంటే చర్యలు తీసుకోవడానికి బదులుగా మన ఖాతాలను హ్యాక్ చేయడం, మన పోస్టులను తొలగించడం వంటి విషయాలపై దృష్టి పెట్టారు. మీరు ఈ పోస్టులను తొలగించగలరేమోగానీ మమల్ని ఈ వేదిక నుండి తుడిచివేయలేరు అని దీప్కే తన ప్రసంగంలో జన సమూహాన్ని ఉద్దేశించి అన్నారు. ఆయన మాటలకు యువత నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన లభించింది. విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ కూడా ఈ నిరసనలో పాల్గొని తమకు మద్దతు ఇచ్చినందుకు దీప్కే ధన్యవాదాలు తెలిపారు.
యువత, విద్యార్థులు అమ్ముడుపోలేదు
ఈ రోజు ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ తాను విమానం దిగడానికి కొద్ది క్షణాల ముందు తన స్వేచ్ఛ చివరి క్షణాలను గడుపుతున్నట్లుగా భావించానని దీప్కే అన్నారు. ఈ ఆశయం కోసం తన స్వేచ్ఛను త్యాగం చేయడానికి తాను పూర్తిగా సిద్ధమయ్యానని అన్నారు. జైలు శిక్ష భయంతో చాలా మంది రాజీపడి అమ్ముడుపోయారని దీప్కే ఆరోపించారు. కానీ ఈ దేశ యువత, విద్యార్థులు తమకు తాము అమ్ముడుపోలేదని ఆయన విద్యార్థుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఈ ప్రదర్శనకు వందలాది మంది ప్రజలు, వారిలో అధికశాతం యువజనులు హాజరయ్యారు. వీరిలో చాలామంది బొద్దింకల ముసుగులు ధరించి పూలు పట్టుకొచ్చారు. స్కూలు విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రులతో కలిసి ఈ నిరసనలో పాల్గొన్నారు. వారిలో అధికశాతం మంది స్కూలు, కాలేజీ విద్యార్థులతోపాటు ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. వారంతా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.
నిరసనలు నచ్చకున్నా న్యాయం కోసం తప్పడం లేదు: వాంగ్చుక్
నిరసనల పట్ల తనకు ఆసక్తి లేదని, కాని న్యాయం కోరుతున్న విద్యార్థులకు అండగా నిలబడాల్సిన అవసరం నేడు ఏర్పడిందని విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగచుక్ తెలిపారు. సీజేపీ నిరసన ప్రదర్శనలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని విద్యా వ్యవస్థలో మౌలిక మార్పులు అవసరమని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారుల పిల్లలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకోవాలని వాంగ్చుక్ సూచించారు. వ్యవస్థలో భాగమైన ప్రజలు కూడా సాధారణ పౌరులకు అందుబాటులో ఉన్నటువంటి విద్యా మౌలిక సదుపాయాలనే పొందాలని, ఈ చర్య అర్థవంతమైన సంస్కరణలకు దారితీయగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

భారీ భద్రత
యువత నిరసనను దృష్టిలో ఉంచుకుని దేశ రాజధాని అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయం, సరిహద్దు ప్రవేశ మార్గాలు, ఇతర సున్నితమైన ప్రదేశాల్లో అదనపు సిబ్బందిని మోహరించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా వ్యూహాత్మక ప్రదేశాలలో 1000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు.
నిరసనకు ప్రతిపక్షాల మద్దతు
సీజేపీ జంతర్ మంతర్ ప్రదర్శనకు విపక్షాలు మద్దతు పలికాయి. ‘ఆప్’తో పాటు వామపక్షాలకు చెందిన నేతలు జంతర్ మంతర్ వద్దకు స్వయంగా వచ్చారు. ఈ నిరసనలకు సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన మద్దతు పలికాయి. ‘ఆప్’ నేత కేజ్రీవాల్ తక్షణమే ప్రధాని స్పందించి విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని అన్నారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ తన ‘ఎక్స్’ పోస్టులో యువత విప్లవ స్వరాలు అహంకార పాలకులకు చేరాలి’ అని రాశారు. కాంగ్రెస్ మాత్రం ఈ నిరసనను సందేహాస్పదంగా చూసింది.
యువత మాట కేంద్రం వినాలి
విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ ఆందోళన చేస్తున్న యువత మాటను కేంద్రం వినాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధ్దవ్ ఠాక్రే పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడుతూ యువతను తక్కువ అంచనా వేయవద్దని అన్నారు. ఎన్సీపీ (శరద్ పవార్) జాతీయ అధికార ప్రతినిధి అనీష్ గవాండే ఈ ఆందోళనకు హాజరయ్యారు. విద్యా శాఖ మంత్రి రాజీనామా కోరుతూ వందలాది మంది దేశంలో ఆందోళన చేస్తున్నా ఆయనపై ఎలాంటి చర్యలు లేవని ఆయన విమర్శించారు. కోట్లాది మంది విద్యార్థుల ప్రాణాలు వారికి లెక్కలేదని, వారిని ఎలా సంరక్షించాలో కూడా ఈ ప్రభుత్వం మరచిపోయిందని అన్నారు. ఆందోళనలో వామపక్ష విద్యార్థి సంస్థ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ), సీపీఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య పాల్గొన్నారు.