ముంబై, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): గోవాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 25 మంది మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. ఉత్తర గోవాలోని అర్పోరాలోని బిర్చ్ బై రోమియో లేన్ అనే నైట్‌క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజధాని పనాజీకి 25 కి.మీ దూరంలో ఈ నైట్ క్లబ్ ఉన్నది. మృతి చెందిన వారిలో 14 మంది నైట్ క్లబ్ ఉద్యోగులు కాగా, నలుగురు టూరిస్ట్‌లు ఉన్నారు. మిగతా ఏడుగురిని గుర్తించాల్సి ఉంది. ఆరుగురు గాయపడ్డారు. అగ్నిమాపక భద్రతా నియమాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్‌కు చెందిన నలుగురు సిబ్బందిని అరెస్ట్ చేశారు. యజమానులపై కూడా కేసు నమోదు చేశామని, వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
నైట్ క్లబ్‌కు ఉన్న చిన్న తలుపులు, క్లబ్‌లోకి దారితీస్తూ చిన్న బ్రిడ్జి లాంటిది మాత్రమే ఉండటంతో ప్రమాదం నుంచి పర్యాటకులు, సిబ్బంది తప్పించుకోలేక పోయారు. ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలికి చేరుకున్న ఆయన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేల పరిహారాన్ని ప్రకటించారు. గోవా ప్రమాదం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున సహాయం అందిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
బాణసంచా వల్లే ప్రమాదం?
వీకెండ్ అయిన శనివారం రాత్రి ప్రమాదం జరిగిన 11.45 గంటలకు డాన్స్‌ఫ్లోర్ కిక్కిరిసి ఉందని, 100 మందికి పైగా ఉన్నారని, అదే సమయంలో డ్యాన్సర్ల చుట్టూ బాణసంచా కాల్చారని, దీని కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చునని ప్రమాదం నుంచి బయటపడిన ఢిల్లీకి చెందిన రియా అనే టూరిస్ట్ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరుకుగా ఉండటంతో వాటర్ ట్యాంకర్లు, అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకోలేకపోయాయని, 400 మీటర్ల దూరంలోనే ఆగిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరణించిన 25 మంది మృతదేహాలను క్లబ్ ప్రాంగణం నుంచి వెలికితీసి, బాంబోలిమ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించినట్లు స్థానిక ఎమ్మెల్యే లోబో వెల్లడించారు. ప్రమాదం జరిగిన క్లబ్ భారతదేశంలో మొట్టమొదటి ఐలాండ్ క్లబ్ అని చెప్పవచ్చు. ఈ క్లబ్ నాలుగు వైపులా నీటితో చుట్టుముట్టి ఉంటుంది. ఈ క్లబ్ అర్పోరా నది మధ్యలో ఉంది.