న్యూఢిల్లీ, జూలై 25: మణిపూర్ అంశంపై చర్చకు ప్రధాని మోదీ ముఖం చాటేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి విపక్షాలు సిద్ధమయ్యాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై నాలుగు రోజులు గడిచినా సభ సజావుగా సాగడం లేదు. కేంద్రం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తూ మణిపూర్ తదితర ముఖ్యమైన అంశాలపై చర్చించకుండా ఉభయ సభలను రోజూ వాయిదా వేస్తూ వస్తున్నది. కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ఎండ గట్టేందుకు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడమే సరైనదని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ విషయంపై విపక్ష పార్టీలు మంగళవారం సమావేశమై చర్చించాయి. అవిశ్వాస తీర్మాన నోటీస్ ముసాయిదాను సిద్ధం చేసి వాటిపై 50 మంది ఎంపీల సంతకాలను సేకరిస్తున్నాయి. ఈ అవిశ్వాస తీర్మానం ద్వారా మణిపూర్ హింసపై మాట్లాడేలా ప్రధానిపై ఒత్తిడి తేవాలని విపక్షాలు భావిస్తున్నాయి.
పార్లమెంటు వరుసగా మంగళవారం కూడా స్తంభించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా లోక్ సభలో మాట్లాడుతున్నపుడు బీఆర్ఎస్ ఎంపీలు తమ నిరసనను కొనసాగించారు. ‘సేవ్ మణిపూర్’ అంటూ నినాదాలు చేశారు. మణిపూర్ మారణకాండపై పార్లమెంటులో చర్చించాలని, ప్రధానమంత్రి సమాధానం చెప్పాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదా తీర్మానం ఇచ్చింది. జూన్ 29 నుంచి వరుసగా బీఆర్ఎస్ పార్టీ మణిపూర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు స్పందించాలని కోరుతూ ఢిల్లీలో ఆందోళన చేస్తూనే ఉన్నది.