న్యూఢిల్లీ: కస్టడీ మరణాల దర్యాప్తులో లోతైన వ్యవస్థాగత అంతరాలున్నాయని జైలు సంస్కరణలపై ఏర్పాటైన సుప్రీంకోర్ట్ ప్యానెల్ సమగ్ర నివేదిక వెల్లడించింది. వివిధ రాష్ర్టాల ఫోరెన్సిక్ ల్యాబ్స్‌లో 52 శాతం పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ఫోరెన్సిక్ పరీక్షల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపింది. దీని కారణంగా డిసెంబర్ 31, 2023 నాటికి 1237 కస్టడీ మరణాల విచారణ జిల్లా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. కొన్ని జైళ్లలో కులాల ఆధారంగా ఖైదీలకు విధులను కేటాయిస్తున్నారని నివేదిక తెలిపింది. ఖైదీలు చేసే పనులకు చెల్లించే రోజువారీ వేతనాల్లో భారీ వ్యత్యాసాలున్నాయని.. మిజోరంలో అది రూ.20 ఉండగా, కర్ణాటకలో రూ.524గా ఉందని వివరించింది. ఖైదీల మానసిక ఆరోగ్యాన్ని సంరక్షించే చర్యలు సరిగా లేవని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. జైల్లోని వైద్యుల్లో చాలా మందికి మానసిక ఆరోగ్యంపై శిక్షణ ఇవ్వలేదని తెలిపింది. ఇది 2018 మానసిక ఆరోగ్య చట్టాన్ని ఉల్లఘించడమేనని పేర్కొంది.