Supreme Court | వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, ఆయా పిటిషన్లు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడం సుప్రీంకోర్టు పరిధిలో లేదని చెప్పింది. ఇది చట్టపరమైన సమస్య కంటే.. సమాజానికి సంబంధించిన సమస్యగా పేర్కొంది. ఇది మొత్తం సమాజంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందని.. ఇప్పటికే చట్టంలో పలు శిక్షలు సైతం ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఈ విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకుండా.. అభిప్రాయానికి రాలేమని స్పష్టం చేసింది.
అయితే, ప్రతీ వివాహం మహిళ సమ్మతితో జరగడం లేదన్న విషయాన్ని మాత్రం కేంద్రం అంగీకరించింది. ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే చట్టరీత్యా శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. వివాహంలో జరిగే.. జరిగే ఉల్లంఘనలకు తేడా ఉంటుందని చెప్పింది. దాంపత్య జీవితంలో తమ జీవిత భాగస్వామి నుంచి శారీరక సంబంధాన్ని కోరుకోవడం సహజమేనని.. అయితే, భార్య ఇష్టానికి వ్యతిరేకంగా ఒత్తిడి చేసే హక్కు భర్తకు లేదని పేర్కొంది. అత్యాచార నిరోధక చట్టాల కింద శిక్ష విధించడం ఎక్కువని.. వివాహంలో మహిళ సమ్మతిని రక్షించేందుకు పార్లమెంట్ ఇప్పటికే చర్యలు తీసుకుందని.. ఇందులో వివాహితలపై క్రూరత్వానికి పాల్పడే వారిని శిక్షించే చట్టాలు సైతం ఉన్నాయని తెలిపింది. మహిళల స్వేచ్ఛ, గౌరవం, హక్కులను రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపింది.