Chhattisgarh | రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం మంగళవారం తుపాకుల మోతతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. మావోయిస్టుల మెరుపుదాడిలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. అయితే మావోయిస్టులు రాకెట్ ఆకారపు బారెల్స్‌తో జవాన్లపై దాడి చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
అయితే బారెల్ గ్రెనేడ్ లాంచర్లను మావోయిస్టులు 2021లో అభివృద్ధి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. స్వదేశీ టెక్నాలజీతో రూపొందించబడిన ఈ లాంచర్లను డజనుకు పైగా నిన్నటి దాడిలో ఉపయోగించినట్లు తెలిపారు. ఈ రాకెట్లతో దాడి చేయడం కారణంగా దాదాపు ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు.
మావోయిస్టుల దాడిలో మొత్తం 15 మంది జవాన్లు గాయపడ్డారు. వారిని హెలికాప్టర్ ద్వారా రాయ్‌పూర్‌కు తరలించినట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగం తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా-బీజాపూర్ జిల్లాల సరిహద్దు టేకులగూడ వద్ద సీఆర్పీఎఫ్, పోలీస్ ఉన్నతాధికారులు మంగళవారం నూతన సీఆర్పీఎఫ్ క్యాంపును ప్రారంభించారు. తర్వాత సైనికులు అక్కడి నుంచి పెట్రోలింగ్‌కి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన వంద మందికి పైగా సాయుధ మావోలు టేకులగూడ శిబిరంపై మెరుపు దాడికి దిగారు. జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు.
ఈ కాల్పుల్లో కోబ్రా 201 బెటాలియన్‌కు చెందిన జవాన్లు దేవాన్ సీ, పవన్‌కుమార్, సీఆర్పీఎఫ్ 150 బెటాలియన్‌కు చెందిన లంబాధర్ సిన్హా అక్కడికక్కడే మృతిచెందారు. 2021లో ఇదే ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో 23 మంది జవాన్లు వీరమరణం పొందారు.