కొత్తగూడెం ప్రగతిమైదాన్, నవంబర్ 24 : ఆయుధాలు వదిలేసి, తమ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి కొంత సమయం కావాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మూడు రాష్ర్టాల ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తూ విడుదల చేసిన లేఖ సంచలనం సృష్టిస్తున్నది. ఆ పార్టీ మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్-మధ్యప్రదేశ్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయ్, ఛత్తీస్‌గఢ్ హోంశాఖ మంత్రి విజయ్‌శర్మ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌యాదవ్‌కు ఈ లేఖ ద్వారా తమ విజ్ఞప్తిని వెల్లడించారు. ఆయుధాలను త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని తమ పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు సోను దాదా తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని, దీనిని ఇటీవల కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న సైతం సమర్థించారని గుర్తు చేశారు.
తమతోపాటు ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ కూడా ఆయుధాలను త్యజించి, ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించాలనుకుంటున్నట్టు తెలిపారు. ఈ మూడు రాష్ర్టాల ప్రభుత్వాలు తమకు కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నట్టు పేర్కొన్నారు. రాబోయే పీఎల్జీఏ వారోత్సవాలనుద్దేశించి ఎలాంటి ఆపరేషన్లు నిర్వహించకూడదని, భద్రతాదళాలు ఇన్ఫార్మర్ల కార్యకలాపాలను ఆపివేయాలని, ఇన్పుట్ లేదా సమాచారం ఆధారంగానే బలగాలను నియమించాలని కోరారు.
ఈసారి తాము పీఎల్జీఏ వారోత్సవాలను జరుపుకోబోమని, అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఫలితం ఆహ్లాదకరంగా ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియలో ముందుకు సాగేవరకు ఆయుధాలను త్యజించాలనే సందేశాన్ని రేడియో ద్వారా ప్రసారం చేయించాలని, తమ వద్ద ఎలాంటి సామాజిక మాధ్యమాలు లేనందున రేడియోల ద్వారానే తమ సహచరులకు సమాచారం చేరుతుందని చెప్పారు.