పాట్నా: బీహార్లో మావోయిస్టులు ప్రజా కోర్టును నిర్వహించారు. నలుగురు వ్యక్తులను బహిరంగంగా ఉరి తీశారు. వారి ఇంటిని బాంబులతో పేల్చి వేశారు. గయా జిల్లా దుమారియాలోని మోన్బార్ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. ఏడాది క్రితం మోన్బార్ గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. అయితే ఇది బూటకపు ఘటన అని మావోయిస్టులు ఆరోపించారు. ఇంటి యజమానులే మావోయిస్టులకు విషమిచ్చి చంపారని పేర్కొన్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో బూటకపు ఎన్కౌంటర్ నిర్వహించారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఆ కుటుంబంపై పగ తీర్చుకున్నారు. మోన్బార్ గ్రామంలో శనివారం ప్రజా కోర్టు నిర్వహించి శిక్షలు అమలు చేశారు. సర్జూ భోక్తా ఇంటిని డైనమైట్లతో పేల్చివేశారు. ఆయన కుమారులు సత్యేంద్ర సింగ్ భోక్తా, మహేంద్ర సింగ్ భోక్తా, వారి భార్యల కాళ్లు, చేతులు కట్టేశారు. కళ్లకు గంతలు కట్టి వారి ఇంటి వెలుపల ఉరివేసారు.
అనంతరం ఆ ఇంటి తలుపులకు ఒక నోటీస్ అంటించారు. ఆ కుటుంబం హత్యా కుట్రకు పాల్పడిందని ఆరోపించారు. నలుగురు మావోయిస్టులు – అమ్రేష్ కుమార్, సీతా కుమార్, శివపూజన్ కుమార్, ఉదయ్ కుమార్లను గతంలో విషం ఇచ్చి చంపారని పేర్కొన్నారు. వీరి హత్యలో ఈ కుటుంబ ప్రమేయం ఉన్నదని ఆ నోట్లో పేర్కొన్నారు. ద్రోహులకు కఠిన శిక్షలు విధిస్తామంటూ మావోయిస్టులు అందులో హెచ్చరించారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మావోయిస్టులు ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలను ఉరికి వేలాడదీసి చంపడంపై దర్యాప్తు చేస్తున్నారు.